ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!

22 Jul, 2019 12:36 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆదివాసీలు, విద్యార్థినీ విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులు, వివిధ వర్గాలకు చెందిన మధ్య తరగతికి చెందిన ప్రజలు దాదాపు వెయ్యి మంది తమ విధులను, పనులను ఎగ్గొట్టి జూలై ఎనిమిదవ తేదీన రోడెక్కారు. దొరికిన బస్సు, మెట్రో, రైలు పట్టుకొని బండ్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంకు చేరుకున్నారు. ‘మెట్రో–3’ ప్రాజెక్ట్‌ కోసం కార్‌ షెడ్డును నిర్మించడం కోసం ముంబై ఆరే కాలనీలోని 2,702 చెట్లను నరికేయాలన్న మున్సిపల్‌ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించేందుకు వారంతా అక్కడికి చేరుకున్నారు.

ఇప్పటికే ముంబై నగరం పర్యావరణ పరిస్థితులు దెబ్బతిన్న నేపథ్యంలో పచ్చటి చెట్లను నరికి వేయడానికి మీకెలా చేతులు వస్తాయంటూ ప్లే కార్డులు పట్టుకొని వారు నినాదాలు చేశారు. అరపులు, కేకలలతో గోల చేస్తూ హంగామా సృష్టించారు. అసలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేసిందే ‘బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌’. చెట్ల నరకివేతనకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ముంబై హైకోర్టు నేరుగా ప్రజల వాణిని తెలుసుకునేందుకు ఈ వేదికను ఏర్పాటు చేయాల్సిందిగా మున్పిపాలిటీకి సూచించింది. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సి ఉండింది. అప్పుడు ఆడిటోరియంలోకి ప్రవేశించేందుకు ప్రజలకు అనుమతివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో నాటి కార్యక్రమం వాయిదా పడింది. నాటి నుంచి ప్రజలు అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తుండడంతో రెండోసారి ఇప్పుడు తగిన ముందస్తు చర్యలతో ప్రజావాణి వినే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆరే కాలనీ చెట్లను కొట్టివేయడాన్ని ఆన్‌లైన్‌లో 82 వేల మంది వ్యతిరేకించారని మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వయంగా అంగీకకరించింది. అయితే వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన వారి సంఖ్య 1,93,865 మందైతే రెండు లక్షల మందికిపైగా వ్యతిరేకిస్తున్నారని సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఈ చెట్ల పరిరక్షణ కోసం మొట్టమొదట ప్రజాహిత వ్యాజ్యాన్ని, వ్యాపారవేత్త, చెట్ల పరిరక్షణ కార్యకర్త జోరు బతేనా దాఖలు చేశారు. అది కాస్త కాలక్రమంలో ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ప్రజా ఉద్యమం ఊపిరి పోసుకుంది ఐదేళ్ల క్రితమే. 1886 ఎకరాల ఆరే అటవి ప్రాంతానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ద్వారా ముప్పు ఏర్పడింది. 1949లో ఈ అటవి ప్రాంతంలో 3,162 ఎకరాల భూమి కాలక్రమంలో తరుగుతూ వచ్చింది. 1977లో రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌కు 108 ఎకరాలు, 1989లో ఫిల్మ్‌ సిటీకి 329 ఎకరాలు, 2009లో కమాండో ఫోర్స్‌కు 98 ఎకరాలు, కొంకన్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీ 145 ఎకరాలు కేటాయించింది. ఇటీవలి కాలంలో నగరంలో జూకు 100 ఎకరాలు కేటాయించారు. నాడు పలుచగా మొదలైన ప్రజా ఉద్యమం నేడు ఊపందుకుంది. నాటి ఉద్యమాన్ని లెక్కచేయని ప్రభుత్వం నేడు పట్టించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఏ నాటికైనా, ఏ ప్రభుత్వంమైన ప్రజా ఉద్యమాలకు తలొంచాల్సిందే.

మరిన్ని వార్తలు