కుప్ప కూలిన భవనం.. హీరోగా మారిన 16 ఏళ్ల కుర్రాడు

17 Jul, 2019 09:00 IST|Sakshi
ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడిన లోకల్‌ హీరో ముస్తఫా

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డోంగ్రీ ప్రాంతంలోని తండేల్‌ వీధిలోని వందేళ్ల క్రితం నాటి నాలుగు అంతస్తుల కేసర్‌బాయి భవనం మంగళవారం ఉదయం కుప్ప కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మరో 40 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతానికి చెందిన దనిష్‌, ముస్తఫా అనే ఇద్దరు కుర్రాళ్ల గురించి స్థానికులు తెగ మాట్లాడుకుంటున్నారు. దనిష్‌ను అదృష్టానికి మారుపేరుగా చెప్పుకుంటుండగా.. ముస్తఫా ఆ ప్రాంతంలో లోకల్‌ హీరో అయ్యాడు.

వివరాలు.. దనిష్‌ తన కుటుంబంతో కలిసి కేసర్‌బాయి భవనం పై అంతస్థులో నివసిస్తున్నాడు. అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రక్త పరీక్ష నిమిత్తం మంగళవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు. అతడు ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికి భవనం కుప్పకూలింది. ఈ సంఘటనలో అతని కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యమే దనిష్‌ ప్రాణాలు కాపాడింది అంటున్నారు స్థానికులు.

లోకల్‌ హీరో ముస్తఫా..
ఇక ముస్తఫా విషయానికి వస్తే.. ఇతనికి, ప్రమాదం జరిగిన భవనానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముస్తఫా తన స్నేహితులను తీసుకుని ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాడు. అప్పటికి ఇంకా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకోలేదు. ఈ విషయం గురించి ముస్తఫా మాట్లాడుతూ.. ‘నేను ట్యూషన్‌లో ఉండగా ప్రమాదం గురించి తెలిసింది. వెంటనే నా స్నేహితులకు ఫోన్‌ చేసి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నాం. సహాయక బృందాలు రావడానికి సమయం పట్టేలా ఉండటంతో మేం రంగంలోకి దిగాం’ అన్నాడు ముస్తఫా.

‘శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. ఇంతలో ఆరు నెలల చిన్నారి శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిసింది. ఏడుపు వినిపిస్తుంది.. కానీ ఎక్కడ నుంచో స్పష్టంగా తెలీలేదు. దాంతో ఓ పది నిమిషాల పాటు వెతగ్గా ఓ చోట చిన్నారి కనిపించింది. స్నేహితుల సాయంతో క్షేమంగా ఆ చిన్నారిని బయటకు తీసుకువచ్చాం. అలానే మరో చిన్న పిల్లాడిని కూడా కాపాడం. అయితే ఉత్త చేతులతో శిథిలాలు తొలగించడం అంత సులువేం కాదు. చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కానీ ఓ ఇద్దరి ప్రాణాలు కాపాడమనే సంతృప్తి ముందు మేం పడిన కష్టమంతా మర్చిపోయాం’ అంటున్నాడు ముస్తఫా. (ప్రాథమిక వార్త: కూలిన బతుకులు)

మరిన్ని వార్తలు