ఆయన గుండెలో 90 లక్షల పరికరం!

21 Apr, 2017 14:54 IST|Sakshi
ఆయన గుండెలో 90 లక్షల పరికరం!

గుండె.. ఎవరికైనా ముఖ్యమే. అలాంటి గుండె సరిగా పనిచేయకపోతే దాన్ని రిపేరు చేయించడానికి ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు సిద్ధపడతాం. ముంబై నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త అలాగే తన గుండె బాగు చేయించుకోడానికి ఏకంగా గుండెలో రూ. 90 లక్షల విలువచేసే పరికరాన్ని పెట్టించుకున్నారు. వాస్తవానికి దానికంటే గుండె మార్పిడి చేయించుకుంటే అందులో మూడోవంతే ఖర్చయ్యేది, చికిత్స కూడా చాలా సులభంగా అయిపోయేది. కానీ దోషి (49) అనే ఆ వ్యాపారికి టీబీ కూడా ఉంది. దాంతో గుండె మార్పిడి కష్టం అయ్యింది. అతడి ఊపిరితిత్తుల మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని దోషికి ఆపరేషన్ చేసిన డాక్టర్ అన్వే మూలే తెలిపారు.

ఐదేళ్ల క్రితం దోషికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో అతడికి హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఏర్పడింది. తాను 30 కిలోల బరువు కోల్పోయానని, కనీసం నిలబడేందుకు కూడా వీలయ్యేది కాదని దోషి చెప్పారు. అత్యంత ఖరీదైన లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైజ్ (ఎల్‌వీఏడీ) అనే పరికరాన్ని అతడికి అమర్చారు. అది భుజాల మీదుగా నల్లటి బ్యాగ్‌లా ఆ పరికరం కనిపిస్తుంది. ముంబైలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో ఈ పరికరాన్ని అమర్చారు. తొమ్మిది నెలల క్రితం ఓ మహిళకు కూడా ఇలాంటి పరికరాన్నే అమర్చారు. అయితే ఆమె కొద్దిరోజులకే మరణించారు. కానీ దోషికి అమర్చినది మాత్రం విజయవంతమైందని, దాంతో హార్ట్ ఫెయిల్యూర్ కేసుల చికిత్సకు ఇప్పుడు సరికొత్త మార్గం కనిపించిందని డాక్టర్ మూలే తెలిపారు. ఎల్‌వీఏడీ అనేది కృత్రిమ గుండె కాదని, ఉన్న గుండెను మెరుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడే పరికరం మాత్రమేనని వివరించారు.

మరిన్ని వార్తలు