హైజాక్‌ అన్నాడు.. ఇంక విమానం ఎక్కలేడు!

20 May, 2018 11:48 IST|Sakshi

తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిపై ఐదేళ్లు నిషేధం

ముంబై : విమానం హైజాక్‌ అయిందంటూ.. తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తిపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. గతేడాది అక్టోబర్‌ 30న ముంబై-ఢిల్లీ జెట్‌ ఎయిర్‌వేస్‌లో ముంబైకి చెందిన అభరణాల వ్యాపారి బిర్జూ కిశోర్‌ సల్లా ప్రయాణించాడు. ఈ సందర్భంగా అతడు భద్రత నిబంధనలు ఉల్లఘించి.. విమానం హైజాక్‌ అయిందంటూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో జెట్‌ అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. విమానాల్లో దురుసుగా ప్రవర్తించే వారిపై నిషేధం విధించాలనే ఉద్దేశంతో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నో ఫ్లై లిస్ట్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) నిబంధనను తీసుకొచ్చింది. ఎన్‌ఎఫ్‌ఎల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ జాబితాలో చేరిన తొలి వ్యక్తి సల్లానే.

సల్లా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లి అక్కడ ఓ కాగితాన్ని వదిలేసి వచ్చాడు. అందులో ‘విమానాన్ని హైజాక్‌ చేశాం. దీనిని పాక్‌ అక్రమిత కశ్మీర్‌కు తరలించాలి. విమానంలో 12 మంది హైజాకర్లు ఉన్నారు. మీరు ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. దీనిని తేలికగా తీసుకోవద్దు.. కార్గోలో బాంబులు కూడా ఉన్నాయి. మీరు ఢిల్లీలో ల్యాండ్‌ చేయాలని చూస్తే విమానాన్ని పేల్చేస్తాం’  అని రాసి ఉంది. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది విమానాన్ని అహ్మాదాబాద్‌కు మళ్లించారు. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన బాంబ్‌ స్క్వాడ్‌ బృందం ఆ కాగితంలో ఉన్నది తప్పుడు సమాచారంగా తేల్చింది.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు సల్లా చేసిన పనిని మూడో లెవల్‌ తప్పుగా(అతి పెద్దదిగా) నిర్ధారించారు. భద్రత నిబంధనలు ఉల్లఘించిన కారణంగా.. సల్లాపై ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించి.. అతన్ని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చారు.  గతేడాది నవంబర్‌ నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.

మరిన్ని వార్తలు