మహిళను భుజాన మోసి హీరో అయ్యాడు

2 Jan, 2018 09:21 IST|Sakshi

కానిస్టేబుల్‌ను ప్రశంసించిన ముంబై పోలీస్‌ శాఖ

ఆ 14 మందిని కాపాడలేకపోయా! :  శివాజీ షిండే

ముంబై : కమలా మిల్స్‌ కాంపౌండ్‌ ప్రమాద ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదైనా.. 14 మంది అమాయక ప్రాణాలు బలికావటం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ప్రమాద సమయంలో సమయ స్ఫూర్తి, ధైర్యం ప్రదర్శించి 8 మంది ప్రాణాలు కాపాడాడు సుదర్శన్‌ శివాజీ షిండే అనే కానిస్టేబుల్‌. ఆయన ఓ మహిళను భుజాన మోసిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది కూడా. 

అతని విధి నిర్వహణలో అతని పనితీరుకు మెచ్చి ముంబై పోలీస్‌ కమిషనరేట్‌ అతనిని సన్మానించింది. ఈ కార్యక్రమానికి కమిషనర్‌ దత్తాత్రేయ పడ్సల్గికర్‌, మేయర్‌ విశ్వనాథ్‌ మహదేశ్వర్‌లు హాజరై శివాజీని సన్మానించి  ప్రశంసలు కురిపించారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఘటన గురించి వివరిస్తూ.. ‘‘అర్ధరాత్రి 12గం.30ని. సమయంలో వైర్‌లెస్‌ ద్వారా సమాచారం నాకు అందించింది. వెంటనే నా బృందంతో అక్కడికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. అరుపులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలతో హడావుడిగా ఉంది. 

వెంటనే మేం రంగంలోకి దిగాం. లోపల చిక్కుకున్న బాధితులను సాధ్యమైనంత మేర బయటకు తీసుకొచ్చాం. ఒకే ఒక్క దారి ఉండటంతో చాలా మంది రెస్ట్‌ రూంలోకి వెళ్లి దాక్కున్నారు.  దీంతో ఎక్కువ మందిని కాపాడలేకపోయాం. ఊపిరిరాడని స్థితిలో మిగతా వారంతా విగత జీవులుగా పడి ఉన్నారు. కానీ, ఆ 14 మందిని కూడా కాపాడాల్సి ఉంది’’ అని భావోద్వేగంతో శివాజీ ప్రసంగించాడు. ఇక శివాజీలానే పక్కనే ఉన్న టెలివిజన్‌ స్టేషన్‌లో పని చేస్తున్న మహేష్‌, సూరజ్‌ గిరిలు కూడా సుమారు 50 మంది ప్రాణాలు కాపాడారు కూడా.

మరిన్ని వార్తలు