కరోనా: ‘నేను ఇప్పుడు కొత్తగా ఉన్నాను’

8 Apr, 2020 09:33 IST|Sakshi

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఆవేదన

ముంబై : ప్రపంచమంతా ప్రస్తుతం కరోనాతో పోరాడుతోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలావిల్లాడిపోతున్నాయి. కొన్ని లక్షలమంది కరోనా బారిన పడగా.. వేలల్లో మృత్యుఘోష వినపడుతోంది. ​అయితే తాజాగా కరోనా లక్షణాలు లేకున్నా కూడా పాజిటివ్‌గా తేలడం మరింత విచారకంగా మారుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ తమకు ఎప్పుడు ఎలా సోకుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని పంచుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌ తేలడంతో సమాజంలో వారిని చూసే విధానం తమతో పాటు తమ కుటుంబాలను కూడా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి )

ముంబైకు చెందిన వ్యక్తి మార్చి 4న యునైటైడ్‌ కింగ్‌డామ్‌లో పర్యటించారు. కరోనా మహమ్మారిగా రూపుదాల్చిన అనంతరం ఆ వ్యక్తి ముంబైకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి కరోనా పాజిటివ్‌ తేలింది. అయితే ప్రస్తుతం చికిత్స అనంతరం కోలుకుని తన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ముందు జాగ్రత్తలు పాటించాను. ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ముంబైకు తిరిగి వచ్చిన వెంటనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాను. కాగా మార్చి 21న ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడంతో.. మార్చి 22న జాస్లోక్‌ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ వాళ్లు నన్ను పరీక్షించి ఇంటికి వెళ్లమని సూచించారు. నన్ను ఇంటికి పంపడం షాక్‌కు గురయ్యాను. మళ్లీ బ్రీచ్‌ కాండీ ఆసుపత్రికి వెళ్లాను. అప్పటికే నా శరీరంలోని లక్షణాలు క్షీణిస్తున్నాయి. మరి కొన్ని పుట్టుకొస్తున్నాయి. అప్పుడే నా ఆరోగ్యం క్షీణిస్తుందని నాకు అర్థమైంది. వెంటనే పరీక్షలు చేయించుకున్నాను. మార్చి 27న నాకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్ట్స్‌ వచ్చాయి. అనంతరం నేను కస్తూర్బా ఆసుపత్రిలో కోవిడ్‌ వార్డులో చేర్చారు. నాతో పాటు మరో తొమ్మిది మంది రోగులు ఉన్నారు. అక్కడ తీసుకున్న చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకున్నాను. నాలో కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆ సమయంలోనే నాకు ఓ వార్త షాక్‌కు గురిచేసింది’’ అని తన ఆవేదనను పంచుకున్నాడు. (కరోనా: ‘నా రక్తంలోనే సమాధానం ఉందేమో’)

‘మా నాన్న పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఇంటి యాజమాని అతన్ని వేధింపులకు గురిచేశాడు. నా తండ్రిని పోలీసులకు అప్పజెప్పి అరెస్ట్‌ చేయిస్తామని బెదిరించాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా కరోనాపై పూర్తి అవగాహనకు రండి. మిడిమిడి జ్ఞానంతో అనవసరంగా భయాందోళనకు గురై కరోనా బారిన పడిన వారిని, వారి కుటుంబ సభ్యులను దూషించడం మానేయండి. వారిపై కాస్తా మానవత్వం చూపించండి. నా కుటుంబంలో ఎవరికి పాజిటివ్‌ నిర్ధారణ జరగలేదు. కరోనా గుర్తించి వాస్తవాలు తెలుసుకొని, మీ చుట్టుపక్కలా వారిని అవగాహన కల్పించండి’ అని విజ్ఞప్తి చేశారు. అలాగే తన వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు లీక్‌ చేశారని ఆరోపించారు. ఫోన్‌ నంబర్‌, ఇంటి అడ్రస్‌ వంటి వాటిని లీక్‌ చేశారని, దీంతో  తనకు రోజుకు 100కి పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని వాపోయాడు. అయితే అధికారులు కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని.. దీనివల్ల అనవసరమైన భయానికి గురయ్యానని తెలిపారు.  ప్రస్తుతం ఈ మహమ్మారి నుంచి పూర్తి కోలుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. (‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’)

మరిన్ని వార్తలు