హాయిగా జీవించాం.. ప్రశాంతంగా చనిపోనివ్వండి!

10 Jan, 2018 18:35 IST|Sakshi

సాక్షి, ముంబయి: తాము ఇంతకాలం ఎంతో ఆనందంగా జీవించామని ఈ చివరిదశలో అనారోగ్యంతో మంచాన పడి, ఆస్పత్రుల చుట్టూ తిరగలేమని చావును ప్రసాదించాలని కోరుతున్నారు ముంబయికి చెందిన వృద్ధ దంపతులు. కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని తాము దాఖలు చేసిన పిల్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సాధ్యమైనంత త్వరగా స్పందించాలని దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నారాయణ్‌ లావాటే (88), ఐరావతి లావాటే (78) దంపతులు దక్షిణ ముంబయి, గ్రాంట్‌ రోడ్డులోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన నారాయణ్‌ 1989లో రిటైర్‌ కాగా, ఓ ప్రైవేట్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌గా చేసిన ఐరావతి 1997లో పదవీ విరమణ చేశారు. అప్పటినుంచీ స్థానిక గ్రాంట్‌ రోడ్డులోని తమ ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కానీ భవిష్యత్తులో ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన మొదలైందన్నారు నారాయణ్‌.

ఒకరు లేకుండా మరొకరం బతకలేమని, అదే విధంగా మాలో ఏ ఒక్కరు అనారోగ్యంతో మంచాన పడి కష్టాలు పడుతున్నా చూడటం తమ వల్ల కాదని నారాయణ్‌ అన్నారు. యాక్టివ్ ఎథనేషియా ద్వారా తమ దంపతులకు కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్‌) అవకాశం ఇవ్వాలంటున్నారు. ప్రశాంతంగా బతికేందుకు ఎంత హక్కు ఉందో.. ఎలాంటి ఆంక్షలు లేకుండా చనిపోయేందుకు పౌరులకు అంతే హక్కు ఉండాలన్నారు. ఇప్పటికీ చాలా వృద్ధాప్యంలో ఉన్నామని, ప్రస్తుతం ఇక్కడ మెట్రో రైలు పనులు జరుగుతున్నందున బయటకు వెళ్లడానికి చాలా కష్టంగా ఉందన్నారు ఐరావతి. నా భర్తకు వచ్చే పెన్షన్‌ మాకు సరిపోతుంది కానీ, కష్టాలు, బాధలతో ప్రాణం వదలడం కంటే సుఖమయంగా లోకాన్ని విడిచిపోవాలని భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఎన్‌సీపీ నేతలు శరద్‌ పవార్‌, సుప్రియ సూలేలతో పాటుగా రామ్‌ జెఠ్మలానీ, రాజ్యసభ సభ్యుడు కరణ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింగ్వీలకు కారుణ్య మరణానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ ఆఫ్‌ బిల్‌ను పంపించినట్లు నారాయణ్‌ దంపతులు వివరించారు. ‘మా బంధువులకు చెబితే అలా చేయవద్దని చెప్పారు... ఎందుకంటే వారికి సంతానం ఉన్నారు, బాధ్యతలున్నాయి. మాకు అలాంటి ఏ సమస్యలు, బాధ్యతలు లేవని’ నారాయణ్‌ దంపతులు అంటున్నారు.

కారణ్య మరణాలు అంటే?.. ఎలా చేస్తారు..
కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫై సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపుతున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు