తృటిలో చావును తప్పించుకున్న ఫ్యాషన్‌ డిజైనర్‌

31 Jul, 2019 17:29 IST|Sakshi

ముంబై: అదృష్టం అంటే ఈ ముంబై ఫ్యాషన్‌ డిజైనర్‌దే. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. నిజంగానే అదృష్టం కాకపోతే.. మెట్రో స్టేషన్‌ మీద నుంచి పది మీటర్ల రాడ్డు క్యాబ్‌ మీద పడటం.. అది కూడా డ్రైవర్‌ పక్కన ఉన్న ఖాళీ సీట్లో పడటం ఏంటి. దాంతో తాను లేచిన వేళ చాలా మంచిదైంది అనుకుంటున్నారు రింకు జైన్‌. వివరాలు.. గోరేగావ్‌కు చెందిన రింకు జైన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఈ క్రమంలో పట్టణంలో ఓ బొటిక్‌ నిర్వహిస్తున్నారు రింకు. ఈ నేపథ్యంలో బుధవారం తన షాప్‌ వద్దకు వెళ్లడానికి ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు.

ముంబై వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో జోగేశ్వరి ప్లైఓవర్‌ కిందుగా క్యాబ్‌ ప్రయాణం చేస్తుండగా.. 10 మీటర్ల పొడవైన రాడ్‌ వచ్చి రింకు ప్రయాణిస్తున్న క్యాబ్‌ మీద పడింది. ఆ రాడ్‌ కాస్త డ్రైవర్‌ పక్కన ఖాళీగా ఉన్న సీట్లో పడింది. ఆ సమయంలో రింకు, ఆమె స్నేహితురాలు వెనక ప్యాసింజర్‌ సీట్లో కూర్చోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం గురించి రింకు మాట్లాడుతూ.. ‘నాకు ముందు సీట్లో కూర్చోనే అలవాటు. కానీ ఈ సారి లగేజ్‌ ఎక్కువ ఉండటంతో దాన్ని డ్రైవర్‌ పక్క సీట్లో పెట్టి.. నేను, నా ఫ్రెండ్‌ వెనక ప్యాసింజర్‌ సీట్లో కూర్చున్నాం. ప్లైఓవర్‌ కిందకు రాగానే మేం ప్రయాణిస్తున్న క్యాబ్‌ మీద రాడ్‌ పడింది. ఈ సంఘటనతో మేం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాము. ఇప్పటికి కూడా ఆ భయం నుంచి కోలుకోలేదు’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు