వాట్సాప్‌ నోటీసులపై కోర్టు సంచలన తీర్పు

16 Jun, 2018 17:44 IST|Sakshi

సాక్షి, ముంబై:  లీగల్‌ నోటీసులపై ముంబై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇక మీదట నేరుగా లేదా పోస్టు ద్వారానే కాకుండా సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌, ఈమెయిల్‌, టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా పంపిన లీగల్‌ నోటీసులకు చట్టబద్ధత ఉంటుందని ప్రకటించింది. ఎస్‌బీఐ, ముంబైకి చెందిన రోహిత్‌ జాదవ్‌ కేసులో కోర్టు ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు.. క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించడం లేదంటూ ముంబైకి చెందిన రోహిత్‌ జాదవ్‌పై ఎస్‌బీఐ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. అతనికి లీగల్‌ నోటీసులు పంపించింది. అయితే జాదవ్‌ ఆ నోటీసులకు స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా జవాబు ఇవ్వలేదు. దాంతో, లీగల్‌ నోటీసులు పంపించామనీ, కోర్టుకు హాజరు కావాలని వాట్సాప్‌లో జాదవ్‌కు సమాచారం ఇచ్చింది. కోర్టుకు హాజరుకావాల్సిన తేదీని పేర్కొంటూ వాట్సాప్‌లో పీడీఎఫ్‌ ఫైల్‌ పంపింది. 

చూశాడు... అయినా స్పందించలేదు..!
తాము వాట్సాప్‌లో పంపిన పీడీఎఫ్‌ ఫైల్‌ను జాదవ్‌ చూశాడనీ, అయినా ఎలాంటి జవాబు ఇవ్వలేదని ఎస్‌బీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఎస్‌బీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు.. సదరు రుణ ఎగవేతదారు వాట్సాప్‌లో పంపిన మేసేజ్‌ను ఓపెన్‌ చేసినట్లు యాప్‌ సమాచారంలో ఉన్న ‘బ్లూ టిక్‌’ను చూస్తే స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఐటీ చట్టంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రిజిస్ట్రర్‌ పోస్టు, నేరుగా పంపిన నోటీసులతో పాటు వాట్సాప్‌, ఈమెయిల్‌, టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా పంపిన నోటీసులు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. దీంతో రోహిత్ కోర్టులో హాజరు కావాలని, ఎస్‌బీఐకు చెల్లించాల్సిన బిల్లును వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. లేకపోతే జైలుకి పంపాల్సి వస్తుందని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు