ఆగిన ముంబై జీవనాడి

21 Feb, 2016 17:12 IST|Sakshi
హార్బర్ లైన్ మార్గంలో సీఎస్టీ-వడాల మధ్య పనులు చేపడుతున్న రైల్వే సిబ్బంది

ముంబై: హార్బర్ లైన్ మార్గంలో సీఎస్టీ-వడాల మధ్య చేపట్టిన జంబో బ్లాక్ ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. అప్ అండ్ డౌన్ మార్గంలో రైల్వే సేవలను మరో 24 గంటలపాటు పూర్తిగా నిలిపేయనున్నారు. దీంతో సీఎస్టీ-వడాల మధ్య మెగాబ్లాక్ కారణంగా రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శుక్రవారం ప్రారంభమైన  మెగా బ్లాక్ ఫిబ్రవరి 22న ఉదయం 1.30 గంటలకు ముగుస్తుంది. రెండు దశలలో నిర్వహిస్తున్న ఈ బ్లాక్‌ను 12 బోగీల రైళ్లను హార్బర్ మార్గంలో నడిపేందుకు కావలసిన మౌలిక సదుపాయలను స్టేషన్లలో కల్పించేందుకు సెంట్రల్ రైల్వే (సీఆర్) చేపట్టింది.

మొదటి 24 గంటల్లో సీఎస్టీ వద్ద ప్లాట్‌ఫాం నంబర్ 1 నుంచి రైళ్లు రాక పోకలు నిలిపేశారు. శుక్రవారం మొత్తం 590 సర్వీసుల్లో 445 సేవలు మాత్రమే నడిచాయి. శనివారం ఉదయం 1.30 గంటల నుంచి మొత్తం సర్వీసులను రద్దు చేశారు. హార్బర్ లైన్ సర్వీసులు వడాల నుంచి పన్వెల్, అంధేరి కారిడార్‌ల మధ్య మాత్రమే రైళ్లు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ప్రయాణికులను పాస్‌లపై ప్రత్యామ్నాయ మార్గాల్లో అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘శుక్రవారం బ్లాక్ ప్రారంభించాం. బ్లాక్ మొదటి దశలో చేయాల్సిన పనులు పూర్తి చేశాం. సీఎస్టీ వద్ద యార్డ్ రీమోడలింగ్ చేశాం. ఈ పని పూర్తయిన తర్వాత డీసీ-ఏసీ కన్వర్షన్ పనులు మార్చి నుంచి మొదలవుతాయి’ అని సీఆర్ చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ చెప్పారు. మెయిన్ లైన్, ట్రాన్స్‌హార్బర్‌లైన్ మధ్య సర్వీసుల్లో మార్పు లేదన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే మెగాబ్లాక్ ఈ ఆదివారం ఉండదని, ఆదివారం సర్వీసులు వీక్లీ టైంటేబుల్ ప్రకారం నడుస్తాయన్నారు.
 
 సీఎస్టీ-వడాల మధ్య మరిన్ని బస్సులు..
 ప్రయాణికుల సౌకర్యార్థం వడాల-సీఎస్టీ స్టేషన్ల మధ్య మరిన్ని బస్సులు నడపనున్నట్లు బెస్ట్ సంస్థ తెలిపింది. కాగా, ప్రాజెక్టు అదనపు సదుపాయాలను ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్  (ఎంయూటీపీ) కల్పిస్తుందని, ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్‌వీసీ) ప్రాజెక్టును అమలు చేస్తుందని సీఆర్ పేర్కొంది. అలాగే 12 బోగీల హార్బర్ లైన్ ఈ ఏడాది మే నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. హార్బర్ లైన్ మార్గంలో పనుల కోసం 300 మంది కార్మికులు, రైల్వే అధికారులను నియమించినట్లు వెల్లడించింది. హార్బర్ లైన్‌లో సీఎస్టీ-పన్వెల్, సీఎస్టీ-అంధేరి, సీఎస్టీ-బోరివలి మార్గాలున్నాయి.
 
 మా కోసమేగా..?

 ఉదయం, సాయంత్రం సమయాల్లో రైళ్లు సమయానుసారం నడవడంలేద ని, మరోపక్క రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని హార్బర్ లైన్ నివాసి సునీల్ కాంబ్లే అన్నారు. అయితే పని పూర్తయిన తర్వాత తమకు లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలో  12 బోగీల రైళ్లు హార్బర్ మార్గంలో నడవనున్నాయని మరో ప్రయాణికుడు చెప్పారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం వడాల-అంధేరి, వడాల-పన్వెల్ మధ్య ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నామని సీఆర్ చీఫ్ పీఆర్వో పాటిల్ చెప్పారు. సీజన్ టికెట్‌లపై థానే, కుర్లా, దాదర్ నుంచి వెళ్లేం దుకు ప్రయాణికులకు అనుమతిచ్చామన్నారు. కాగా, గమ్యస్థానానికి చేరుకునేం దుకు ఎక్కువ రైళ్లు మారాల్సి వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా