‘నేను ఆర్మీలో చేరడమే నా భర్తకిచ్చే నివాళి’

25 Feb, 2019 13:19 IST|Sakshi

ముంబై : సైనికులను చంపి.. మనల్ని బెదిరించాలని చూశారు ఉగ్రవాదులు. కానీ ఆ బెదిరింపులకు భయపడమని.. 40మందిని చంపితే మరో 4 వేల మంది భరతమాత కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉంటారని ఆ ముష్కరులకు తెలియదు. తండ్రి మరణిస్తే కొడుకు, భర్త మరణిస్తే భార్య సరిహద్దులో ప్రాణాలర్పించడానికి సిద్దంగా ఉంటారని నిరూపించారు గౌరీ ప్రసాద్‌. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన గౌరీ(31) భర్త.. ప్రసాద్‌ గణేష్‌ ఆర్మీ మేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం భారత్‌ - చైనా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ప్రసాద్‌ మరణించారు. భర్త మరణించాడని తెలిసి ఏడుస్తూ కూర్చోలేదు గౌరీ.

భర్త సేవలను కొనసాగించడం కోసం తాను కూడా సైన్యంలో చేరాలని భావించింది. అందుకోసం అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యారు. అయితే తొలి ప్రయత్నంలో ఆమె ఓడిపోయింది. కానీ పట్టువిడవకుండా ప్రయత్నించి రెండో ప్రయత్నంలో విజయం సాధించడం మాత్రమే కాదు టాపర్‌గా నిలిచారు. త్వరలోనే చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణ పొంది, అనంతరం లెఫ్టినెంట్‌ హోదాలో సైన్యంలో చేరి విధులు నిర్వహించనున్నారు.

ఈ విషయం గురించి గౌరీ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ ఉండాలని నా భర్త ప్రసాద్‌ కోరిక. ఆయన చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఏడుస్తూ కూర్చుని ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనిపించింది. నా భర్త దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి మధ్యలోనే ప్రాణాలు విడిచారు. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించాను. అందుకే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఇక మీదట ఆయన యూనిఫామ్‌ను, స్టార్స్‌ను నేను ధరిస్తాను.. ఆయన విధులు నేను నిర్వహిస్తాను. ఇక ఇది మా ఇద్దరి యూనిఫామ్‌ అవుతుంది. ఇదే నేను నా భర్తకిచ్చే గొప్ప నివాళి’ అంటూ చెప్పుకొచ్చారు గౌరీ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు