కోవిడ్‌: గుండెపోటుతో తల్లి మృతి.. చైనాలో శవం

18 Feb, 2020 08:34 IST|Sakshi
పునీత్‌ మెహ్రా(ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)

ముంబై: కోవిడ్‌-19(కరోనా వైరస్‌) కష్టాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సోకి ఉంటుందనే అనుమానంతో నిర్బంధలో ఉన్నవాళ్లు కొందరైతే.. దాని ఆనవాళ్లు బయటపడేలోపే కన్నుమూసిన వాళ్లు ఇంకొందరు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈ ప్రాణాంతక వైరస్‌ ఓ భారతీయ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. గుండెపోటుతో మరణించిన తల్లికి అంత్యక్రియలు చేయలేక ఓ తనయుడు విలవిల్లాడిపోతున్నాడు. తల్లి శవాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

వివరాలు.. ముంబైకి చెందిన పునీత్‌ మెహ్రా(35) డెంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. మూడు వారాల క్రితం తన తల్లి రీటా మెహ్రా(63)తో కలిసి ఎయిర్‌ చైనా ఫ్లైట్‌కు చెందిన విమానంలో ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో రీటాకు గుండెపోటు రావడంతో.. ఆమె విమానంలో కుప్పకూలింది. దీంతో చైనాలోని జెంగ్జౌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆమె మరణించింది. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో తల్లి శవాన్ని అక్కడే ఉంచి.. పునీత్‌ ముంబైకి వచ్చేశాడు. అప్పటి నుంచి రీటా శవం కోసం ఆమె కుటుంబం ఎదురుచూస్తేనే ఉంది.('వీరి ప్రేమ ముందు ఏ వైరస్‌ నిలబడలేదు')

ఈ నేపథ్యంలో పునీత్‌ మెహ్రా ఓ జాతీయ మీడియాతో తన ఆవేదన పంచుకున్నాడు. ‘‘అసలు సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, భారత విదేశాంగ శాఖ, బీజింగ్‌లోని భారత రాయబారికి లేఖ రాశాను. అయినప్పటికీ మా అమ్మ గురించి ఎటువంటి సమాచారం అందడం లేదు. తనను ఇక్కడికి ఎలా తీసుకురావాలో మాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని హెనన్‌ ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రిలో ఉంచారు. ఇప్పటికి 24 రోజులు గడిచింది. అమ్మ లేకుండానే నేను ఇక్కడికి తిరిగి వచ్చేశాను. ఆమె అంత్యక్రియలు చేయలేకపోతున్నామనే బాధ వెంటాడుతోంది’’ అని పేర్కొన్నాడు.(‘కరోనా పేషెంట్‌’ను హతమార్చిన ఉత్తర కొరియా!)

ఇక ఈ విషయంపై స్పందించిన అధికారి మాట్లాడుతూ.. చైనాలోని అసాధారణ పరిస్థితుల కారణంగా జాప్యం జరుగుతోందని వెల్లడించారు. కోవిడ్‌ వ్యాపించకుండా చైనా ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయని... అందుకే ఈ విషయంలో ఎన్నిసార్లు సంప్రదించినా చైనా అధికారుల నుంచి సానుకూల స్పందన రావడం లేదని పేర్కొన్నారు. కాగా కోవిడ్‌ మహమ్మారి కారణంగా.. చైనాలో సంభవించిన మరణాల సంఖ్య నేటితో 1800కి చేరింది. 

కోవిడ్‌-19: ఉచితంగా 2 వేల ఐఫోన్లు పంచిన జపాన్‌!

కోవిడ్‌-19: వరుస కథనాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు