అనుమతి లేకుండా కన్నారని కోర్టు కీడుస్తాడట..!

7 Feb, 2019 11:04 IST|Sakshi

ముంబై : ముంబైకి చెందిన రఫేల్‌ సామ్యూల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాడు. తన అనుమతి లేకుండా తనను కన్నందుకు తల్లిదండ్రులపైనే కేసు వేస్తానంటూ విచిత్ర వాదనతో ముందుకొచ్చాడు. తనను తాను యాంటీ-నటాలిస్ట్‌(జనాభాను తగ్గించే వ్యక్తిగా) పేర్కొన్న సామ్యూల్‌...‘ అన్ని దుష్పరిణామాలకు జనాభా పెరుగుదలే మూల కారణం. పిల్లల్ని కనడం ఆపండి’ అంటూ ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చాడు. అంతేకాకుండా తాను ఇలా మాట్లాడటానికి కారణాలు వివరిస్తూ ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.

‘ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి తన అనుమతి, ప్రమేయం లేకుండానే భూమి మీదకి వస్తున్నాడు. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పటికీ సొంతం కారు. పిల్లల్ని పెంచాం కదా అని తమను పోషించాలంటూ తల్లిదండ్రులు వారిని బ్లాక్‌మెయిల్‌ చేయొద్దు. అలాగే పిల్లలు కూడా నిజంగా, నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నపుడు మాత్రమే అమ్మానాన్నలను చేరదీయాలి. అంతేతప్ప మొహమాటానికి నాటకాలు ఆడాల్సిన పనిలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను కేసు వేస్తానని చెప్పినపుడు మొదట తల్లిదండ్రులు వ్యతిరేకించారని, అయితే ప్రస్తుతం తల్లి మాత్రం తనను అర్థం చేసుకుందని పేర్కొన్నాడు. అసలు ఎవరో కోరుకున్నారని పిల్లలకు జన్మనివ్వడం తప్పని, జీవితం సవాళ్లతో కూడుకున్నది కాబట్టి.. జనాభా నియంత్రణను పోత్సహించడమే తన లాంటి యాంటి నటాలిస్టుల ఎజెండా అని వ్యాఖ్యానించాడు.

కాగా రఫేల్‌ సామ్యూల్‌ వాదనను కొంతమంది నెటిజన్లు సమర్థిస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఇదేమీ చోద్యం అంటూ విమర్శిస్తున్నారు. జనాభాను నియంత్రించాలంటే ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా