ప్రజలకు ఉచితంగా అ‍త్యంత ఖరీదైన టాయిలెట్‌

2 Oct, 2018 18:40 IST|Sakshi
ముంబైలోని అ‍త్యంత ఖరీదైన టాయిలెట్‌

ముంబై : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నగరంలోనే అత్యంత ఖరీదైన పబ్లిక్ టాయిలెట్‌ను బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది. దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద, ఎయిరిండియా ఆఫీసుకు ఎదురుగా ఈ టాయిలెట్‌ను నిర్మించారు. ఐదు సీటు గల ఈ టాయిలెట్‌ కోసం సుమారు 90 లక్షల రూపాయలతో ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు సీట్లలో రెండు సీట్లను మహిళల కోసం కేటాయించారు. ఈ పబ్లిక్‌ టాయిలెట్‌ సోలార్‌ ప్యానల్‌తో రూపొందింది. నీటిని పొదుపు చేసేందుకు వాక్యుమ్‌ టెక్నాలజీని కూడా దీని కోసం వాడారు. పైన సోలార్‌ ప్యానల్స్‌తో రూపొందిన తొలి వాక్యుమ్‌ టాయిలెట్‌ ఇదేనని బీఎంసీ అధికారి చెప్పారు.

మెరైన్ డ్రైవ్ యొక్క ఆర్కిటెక్చర్ దీనికి డిజైన్ చేశారు. ఈ టాయిలెట్‌ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జిందాల్ గ్రూపు నిర్మించింది. అయితే మొదటి రెండు నెలలు ఉచితంగా సర్వీసులను ప్రజలకు అందించనున్నారు. అయితే ఆ తర్వాత ప్రజలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఖరీదైన టాయిలెట్‌ నేటి నుంచి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఎయిర్ ఇండియా భవనానికి ఎదురుగా ఉన్న ఈ పబ్లిక్ టాయిలెట్‌ను బీఎంసీ ఆధ్వర్యంలో సోమవారం యువసేన చీఫ్ ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా పౌరులకు అందుబాటులో అత్యంత ప్రమాణాలు కలిగిన టాయిలెట్లో ఇది ఒకటి. ఇది పూర్తిగా సీఎస్ఆర్ నిధులతో నిర్మించబడింది. మా బాధ్యత కూడా దీన్ని ఇంతే శుభ్రంగా కాపాడుకోవడం’ అని బీఎంసీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. సాధారణంగా ఒక టాయిలెట్‌ను ఒక్కసారి ఫ్లస్‌ చేస్తే, ఎనిమిది లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అదే వాక్యుమ్‌ టెక్నాలజీతో నీటి వినియోగం బాగా తగ్గుతుందని, కేవలం 800 ఎంఎల్‌ నీరు మాత్రమే అవసరం పడుతుందని సమటెక్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకుడు అక్షత్ గుప్త చెప్పారు.  

మరిన్ని వార్తలు