ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముంబై నెటిజన్లు

23 Jan, 2020 12:04 IST|Sakshi

మహారాష్ట్రలోని మాల్స్, సినిమా థియేటర్లు, షాపులు, రెస్టారెంట్లు ఇకపై 24 గంటల పాటు తెరిచే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియా వినియోగదారులు, ముంబై వాసులు పెద్ద సంఖ్యలో స్వాగతించారు. జనవరి 27 నుంచి 24/7 పేరుతో రిటైల్ అవుట్‌ లెట్లను ప్రారంభించాలన్న ప్రతిపాదనను బుధవారం మహారాష్ట్ర మంత్రివర్గం కేబినెట్‌ బేటీలో నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రసుత్తం ఈ సేవారంగాలలో పనిచేస్తున్న ఐదు లక్షల మందితో పాటు కొత్తవారికి అవకాశాలు వస్తాయని, దీనిని అమల్లోకి తేవడం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చని టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. అయితే మొదటి దశలో మాల్స్‌లో ఉండే షాపులు, సినిమా థియేటర్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నట్లు ఆదిత్య స్పష్టం చేశారు. కానీ పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్తారెంట్లు మాత్రం ఎప్పటిలానే అర్థరాత్రి 1.30 గంటల తర్వాత మూసే ఉంటాయని తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్‌ మీడియా వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. కమెడియన్‌ అతుల్‌ కాత్రి ఆదిత్య థాక్రేకు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశాడు.'మొత్తం మీద ముంబయి నగరం 24 గంటలు పడుకోకుండా పని చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యాపారవేత్తలకు,  నిరుద్యోగులు, భద్రత వంటి విషయాలలో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఒక ముంబయి వ్యక్తిగా దీనిని స్వాగతిస్తున్నా. థ్యాంక్యూ ఆదిత్యథాక్రే' అంటూ అతుల్‌ కాత్రి పేర్కొన్నాడు.

'ఇక మీదట తెల్లవారుజామున 2గంటలకు హెయిర్‌ కట్‌ చేయించుకోవచ్చు, బ్యాంక్‌కు వెళ్లొచ్చు.. కానీ మద్యం మాత్రం తాగలేనంటూ' సరిత అనే యువతి ఫన్నీ ట్వీట్‌ చేశారు. ' మహారాష్ట్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. ఈ నిర్ణయం ద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, మిగతా నగరాల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని' మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీనిని తప్పుబట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాల్స్‌, సినిమా థియేటర్స్‌ 24 గంటల పాటు తెరిచే ఉంచితే రేప్‌ కేసులు పెరిగిపోతాయంటూ బీజేపీ నేత రాజ్‌ పురోహిత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు