పనిమంతులు ముంబైవాసులు...!

5 Jun, 2018 00:06 IST|Sakshi

అడుగు తీస్తే మరో అడుగు పెట్టేందుకు ఖాళీ లేక కిక్కిరిసిన లోకల్‌ ట్రైన్లు...స్టేషన్లలో రైళ్లు ఆగినపుడు ఎక్కడానికి, దిగడానికి ఒలంపిక్‌ పతకం కోసమా అన్నట్టుగా పోటీపడే జనం...లక్షలాది ఉద్యోగులకు సమయానికి మధ్యాహ్న భోజనం అందించేందుకు అహోరాత్రులు శ్రమించే డబ్బా వాలాలు...వాహనాలు, మనుషులు, ట్రాఫిక్‌తో నిండిపోయిన రహదారులు... రెండుకోట్లకు పైగా ప్రజల రంగురంగుల కలల ప్రపంచం... ముంబై...!

అసలు అలుపనేదే లేని, నడిరాత్రి అయినా ఎక్కడ ఆగకుండా నిరంతరం పయనిస్తూ, రాత్రిపూట కూడా విశ్రాంతి అనే మాట కూడా ఎరగని  మహానగరమిది.  ఉద్యోగులు అత్యధికంగా కష్టించే నగరంగా దీనిని మార్చడంలోనూ అక్కడి ఉద్యోగులు పై చేయి సాధించారు.  ఇప్పుడిక్కడి  ఉద్యోగులు  ప్రపంచంలోనే అత్యధిక గంటలు పనిచేస్తున్న వారిగా  గుర్తింపు పొందారు. ప్రపంచంలోని 77 ప్రధాన నగరాల్లో ఏడాదికి 3,314.7 గంటల పాటు పనిచేస్తున్న రికార్డ్‌తో ప్రథమస్థానంలో నిలిచారు.  ఇది ప్రపంచ సగటు 1,987 గంటల కంటే ఎంతో ఎక్కువ. ముఖ్యమైన ఐరోపా నగరాలు... రోమ్‌–1,581, పారిస్‌–1,662 పనిగంటలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువే.. ముంబైలో   సగటు ఉద్యోగి ఏడాదికి 3,314.7 గంటలు పనిచేస్తున్నట్లు తాజాగా స్విస్‌ బ్యాంక్‌ యూబీఎస్‌ అధ్యయనంలో వెల్లడైంది. 

ప్రపంచవ్యాప్తంగా 77 నగరాల్లో సగటున ఏడాదికి పనిచేసే గంటలతో పాటు వివిధ అంశాలపై జరిపిన పరిశీలనను  ‘ప్రైస్‌ అండ్‌ ఎర్నింగ్స్‌ 2018 రిపోర్ట్‌’పేరిట విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌ మధ్యలో ఈ నగరాల్లోని 75 వేలకు పైగా డేటా పాయింట్లను సేకరించారు.  ఈ మహానగరాల్లో ధరలు, ఆదాయం, కొనుగోలుశక్తి స్థాయి, తదితరాలను సూచికలుగా తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.

టాప్‌–5 నగరాలివే: 1) ముంబై–3,314.7– 2) హనోయి–2,691.4– 3) మెక్సికో సిటీ–2,622.1– 4) న్యూఢిల్లీ–2,511.4–5) బొగొటా–2,357.8 
అతి తక్కువ పనిగంటల నగరాలివే:1) లాగోస్‌–609.4– 2) రోమ్‌–1,581.4–3) పారిస్‌–1,662.6– 4) కోపెన్‌హగన్‌–1,711.9–5) 1,719.6

ఏడాదికి తక్కువ సెలవులు  తీసుకున్న వారిలో (సగటున  10,4 రోజులతో) కూడా ముంబైవాసులు  కింది నుంచి అయిదో స్థానంలో నిలిచారు. మొదటి నాలుగుస్థానాల్లో లాగోస్, హనోయి, బీజింగ్, లాస్‌ఏంజిల్స్‌ నగరాలున్నాయి. అత్యధికంగా 37 రోజుల సెలవులతో రియాద్‌ నగరం అగ్రస్థానంలో నిలిచింది. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్, బార్సిలోనా, దోహ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రస్తుతం స్టేటస్‌ సింబల్‌గా,  ఖరీదైన మొబైళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న   ఐ ఫోన్‌ గీ (టెన్‌) ఫోన్‌ కొనేందుకు కైరో వాసి 1,066.2 గంటలు, ముంబై ఉద్యోగి 917.8 గంటలు, న్యూఢిల్లీ పౌరుడు 804 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, అదే జూరిచ్‌లోనైతే 38.2 గంటలు, జెనీవాలో 47.5 గంటలు, లాస్‌ ఏంజెల్స్‌లో 50.6 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఆయా మహానగరాల్లో  ఆర్జించే వేతనాల్లోని వ్యత్యాసాలను కూడా ఈ సర్వే ఎత్తిచూపింది
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు