అడుక్కుంటాను అనుమతివ్వండి

9 May, 2018 10:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ప్రభుత్వం నాకు రెండు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి పోలీసు యూనిఫామ్‌లోనే అడుక్కునేందుకు నాకు అనుమతివ్వండి అంటు ముంబై కానిస్టేబుల్‌ ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు ఒక విన​తి పత్రం ఇచ్చారు. ముంబైకి చెందిన ద్యనేశ్వర్‌ అహిర్రావ్‌ తొలుత స్థానిక మురోల్‌ ఆయుధ విభాగంలో పనిచేసేవాడు. కొన్ని రోజుల కిందట ఇతన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి మార్చారు. సరిగా ఆ సమయంలోనే అతని భార్య కాలు విరగడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గాను మార్చి 20 నుంచి 22 వరకు సెలవు పెట్టాడు.

ఈ విషయం గురించి ఇంచార్జికి ఫోన్‌లో తెలియజేసాడు. అనంతరం మరో ఐదు రోజులు కూడా సెలవు తీసుకున్నాడు. భార్యను ఆస్పత్రి నుంచి తీసుకువచ్చిన తర్వాత మార్చి 28న వచ్చి తనకు కేటాయించిన మాతోశ్రీలో విధుల్లో చేరాడు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకూ అతనికి జీతం రాలేదు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో పోలీసు దుస్తుల్లోనే అడుక్కునేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ద్యనేశ్వర్‌ మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుకు అలానే ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాడు. ఆ ఉత్తరంలో తను సెలవు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందువల‍్ల తనకు యూనిఫామ్‌లో అడుక్కునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు.

దీని గురించి ఒక సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్‌ ఇంచార్జికి తెలపకుండా విధులకు హాజరు కాని వారికి మాత్రమే జీతం ఇవ్వకుండా ఆపుతారు. అందువల్లే ద్యనేశ్వర్‌కు రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదని తెలిపారు.


ద్యనేశ్వర్‌ రాసిన లేఖ

మరిన్ని వార్తలు