ముంబై పోలీసుల ఔదార్యం

24 Mar, 2018 16:39 IST|Sakshi

న్యూ ఢిల్లీ : ఆడుతూ, పాడుతూ స్నేహితులతో కలిసి హుషారుగా బడికి వెళ్లాల్సిన ఆ చిన్నారి పై విధి కక్ష కట్టింది. మరికొన్ని రోజుల్లో ఆ పసివాడు బాల్యాన్నే కాదు జీవితాన్నే కోల్పోనున్నాడు. నిండా ఏడేళ్లు కూడా లేని పసివాడిని క్యాన్సర్‌ రూపంలో విధి వెక్కిరించింది. మృత్యువు ఎప్పుడు తనను కబళిస్తుందో తెలియని ఆ చిన్నారికి ఒక కోరిక ఉంది. అందరి పిల్లల్లానే తాను బాగా చదువుకుని పెద్దయ్యాక పోలీసాఫీసర్‌ కావాలనుకున్నాడు. మరి ఇప్పుడు ఆ కల నెరవేరెందుకు అవకాశం లేదు. కానీ ఆ కోరికను ముంబై పోలీసుల సహకారంతో ‘మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌’ వారు తీర్చారు.

పోలీసుల ఔదార్యాన్ని తెలిపే ఈ సంఘటన ముంబైలో జరిగింది. అర్పిత్‌ మండల్‌ అనే ఏడేళ్ల బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతని చివరి కోరిక పోలీసు ఆఫీసర్‌ కావడం. మేక్‌ ఏ విష్‌ వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అర్పిత్‌ను ఒక రోజు ములంద్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. అర్పిత్‌ పోలీస్‌ దుస్తుల్లో రాగ మిగితా పోలీసు అధికారులు అతనికి గౌరవ వందనం చేశారు. వారి సెల్యూట్‌ని స్వీకరించి డెస్కులో కూర్చున్న అర్పిత్‌ కళ్లలో సంతోషం అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ముంబై పోలీసులు తమ ట్విటర్‌లో పోస్టు చేశారు. ముంబై పోలీసుల ఔదర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లల కోరికలను తీరుస్తున్న మేక్‌ ఏ విష్‌ సంస్థ 2015లో కూడా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడిని బోయవాడ పోలీస్‌స్టేషన్‌కు ఒక రోజు పోలీసాఫిసర్‌గా చేసింది.

మరిన్ని వార్తలు