అర్నాబ్‌కు పోలీసుల నోటీసులు

26 Apr, 2020 21:06 IST|Sakshi

ముంబై : రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి ముంబై పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్నాబ్‌ తన టీవీ షోలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర మంత్రి నితిన్‌ రౌత్‌(కాంగ్రెస్‌) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ కింద విచారణకు హాజరు కావాలని అర్నాబ్‌కు నోటీసులు ఇచ్చారు. కాగా, కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అర్నాబ్‌ తన టీవీ షోలో వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా అర్నాబ్‌పై దేశంలోని పలుచోట్ల కాంగ్రెస్‌ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై అర్నాబ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

అర్నాబ్‌ అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మూడు వారాల పాటు అతనిపై అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అర్నాబ్‌తోపాటు, రిపబ్లిక్‌ టీవీ కార్యాలయానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే నాగ్‌పూర్‌లో నితిన్‌ రౌత్‌ చేసిన ఫిర్యాదుకు సంబంధించి మాత్రం కోర్టు స్టే విధించలేదు. దానిని ముంబైకి బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు అర్నాబ్‌కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే సమయంలో అర్నాబ్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడికి కాంగ్రెస్‌ నాయకులే కారణమని అర్నాబ్‌ ఆరోపించారు. 

చదవండి : అర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊర‌ట‌

మరిన్ని వార్తలు