‘బసంతిని వేలం వేశారు..’

3 Aug, 2018 12:32 IST|Sakshi

ముంబై : సాధరణంగా టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు.. జరిమానా విధిస్తారు. ఒక వేళ జరిమానా కట్టలేక పోతే టీసీ కాళ్లావేళ్లా పడి, బతిమిలాడి బయటపడతాం. కానీ ముంబై రైల్వే అధికారులు మాత్రం టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికురాలికి జరిమానా విధించారు. కానీ ఫైన్‌ చెల్లించలేక పోవడంతో ఆ ప్రయాణికురాల్ని వేలం వేశారు. ఎంత దారుణం.. ఫైన్‌ చెల్లించలేదని వేలం వేస్తారా అంటూ రైల్వే అధికారులపై ఆగ్రహించకండి.

ఎందుకంటే రైల్వే అధికారులు వేలం వేసిన ‍ప్రయాణికురాలు మనిషి కాదు ‘మేక’. వినడానికి కాస్తా విచిత్రంగా అనిపిస్తున్న ఈ సంఘటన బుధవారం సాయంత్రం ముంబై రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం రైల్వే నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రయాణికుడు మేకతో కలిసి ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. అది గమనించిన టీసీ అతన్ని జంతువులతో కలిసి ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం.. ముందు టికెట్‌ చూపించమని అడిగాడు. సదరు ప్రయాణికుడు నిబంధనలను అతిక్రమించడమే కాక అతను టికెట్‌ కూడా కొనలేదు.

దాంతో టీసీ అతనికి ఫైన్‌ విధించాడు. జరిమానా చెల్లించడానికి తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. కానీ టీసీ ఫైన్‌ కట్టాల్సిందేనని చెప్పడంతో.. సరే నా మేకను మీ దగ్గర ఉండనివ్వండి. నేను వెళ్లి డబ్బులు తీసుకోస్తాను అని కోరాడు. చేసేదేంలేక టీసీ మేకను పట్టుకుని నిల్చున్నాడు. డబ్బులు తీసుకోస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగిరాలేదు. దాంతో ఆ మేకను స్టేషన్‌లోనే కట్టేసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

అంతేకాక ఆ మేకకు ‘బసంతి’ అనే పేరు కూడా పెట్టారు. కానీ ఇలా ఎన్ని రోజులు..? అందుకే చివరకూ మేకను వేలం వేయడానికి నిర్ణయించారు. ‘బసంతి’ ఖరీదును మూడు వేల రూపాయలుగా నిర్ణయించారు. అయితే మరో ఆసక్తికర అంశం ఏంటంటే మేకను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మరో 500 రూపాయలు తగ్గించి వేలం వేశారు. ఓ వ్యక్తి 2500 రూపాయలను చెల్లించి ‘బసంతి’ని తన సొంతం చేసుకున్నాడు.  ముంబై లోకల్‌ రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే రూ. 256 జరిమానా విధిస్తారు. కానీ బసంతిని వేలం వేయడం ద్వారా 10 రెట్లు అధికంగా రైల్వేకు లాభం రావడం విశేషం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా