రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని...

17 Jul, 2019 19:15 IST|Sakshi

ముంబై : రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకూడదని రైల్వే అధికారులు పూజలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహానగరంలోని కార్యాలయాలకు చేరుకునేందుకు దాదాపు అందరు ఉద్యోగులు రైలు మార్గాన్నే ఆశ్రయిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లోకల్‌ రైళ్లలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో మధ్య రైల్వే అధికారులు శనివారం తమ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఉన్నతస్థాయి అధికారులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. రైళ్లలో ఉన్న లోపాలు గుర్తించకుండా ఇలా పూజలు చేస్తే ఏం లాభం అంటూ పలువురు అధికారుల తీరును విమర్శించారు.

కాగా ఈ వార్తలను రైల్వే అధికారులు కొట్టిపడేశారు. అప్పుడప్పుడు సాధారణంగా కార్యాలయాల్లో ఇలాంటి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక ముంబై సెంట్రల్‌ లైన్‌ సబ్‌ అర్బన్‌ రైళ్లలో రోజుకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణిస్తారు. అయితే సాంకేతిక తప్పిదాల కారణంగా ఈ ఒక్క ఏడాదే దాదాపు 400 రైళ్లు రద్దు కాగా... దాదాపు 3 వేల ట్రెయిన్‌లు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరాయి. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు