అధికారులకు రైల్వేమంత్రి డెడ్‌లైన్‌

1 Oct, 2017 09:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మహా’  విషాదం నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌... ఆశాఖ ఉన్నతాధికారులకు వారం రోజులు డెడ్‌లైన్‌ విధించారు. ముంబై ఎల్పిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే 35మం‍ది గాయపడ్డారు. ఈ ఘటనపై పీయూష్‌ గోయల్‌ శనివారం రైల్వే భద్రత అంశంపై  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గడువులోపు ముంబై సబర్బన్ రైల్వేస్టేషన్‌లో భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రమాదాలకు అవకాశం ఉన్న కీలక ప్రదేశాలను గుర్తించాలన్నారు. అంతేకాకుండా అన్ని స్టేషన్లలో లోపల, బయటకు వెళ్లే ప్రాంతాలలో పూర్తిస్థాయి ప్రణాళిక చేపట్టాలని, రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లను సాధ్యమైనంత క్రమబద్ధీకరించేలా చూడాలన్నారు. వారం రోజుల్లోగా వీటన్నింటిని పూర్తి చేయాలని గోయల్‌ ఆదేశాలు ఇచ్చారు. ఇక 15 నెలల్లోగా ముంబయితో పాటు దేశంలోని అన్ని సబర‍్బన్‌ రైళ్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కాగా 23 మందిని బలిగొన్న ఎల్ఫిన్‌స్టన్‌ స్టేషన్‌ వద్ద అదనపు పాదచారుల వంతెన (ఎఫ్‌ఓబీ) నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. ప్రమాదం జరిగిన శుక్రవారమే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 40 అడుగుల పొడవు నిర్మించనున్న ఈ వంతెనను 2016 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. ముంబై సబర్బన్‌ ప్రాంతంలో రూ.45 కోట్ల బడ్జెట్‌తో చేపట్టబోయే ఎస్కలేటర్లు, ఎఫ్‌ఓబీలు, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్ల ప్రాజెక్టుల్లో ఇది అంతర్భాగం. రూ.9.5 కోట్ల వ్యయమయ్యే ఈ వంతెనను వచ్చే ఏడాది అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు