ముంబై వెళ్లారో.. ఇక అంతే!

13 May, 2016 14:48 IST|Sakshi
ముంబై వెళ్లారో.. ఇక అంతే!

ఏదైనా మంచి ఉద్యోగం ఆఫర్ ఉందని ముంబై వెళ్లాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే అక్కడ బతకడం అంటే పొగగొట్టంలో కాపురం ఉన్నట్లేనట. ప్రపంచంలో కాలుష్యం బాగా ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలోంచి ఢిల్లీ తప్పుకొందని సంతోషపడుతుంటే.. ఆ జాబితాలోకి ముంబై వచ్చిచేరింది. అత్యంత కలుషిత మెగాసిటీలలో ముంబై ఐదోస్థానాన్ని ఆక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపింది. పీఎం 10 స్థాయిని బట్టి చూస్తే ఈ విషయం తెలుస్తోంది. డబ్ల్యుహెచ్ఓ పర్యవేక్షిస్తున్న 122 భారతీయ నగరాలలో పీఎం 2.5 స్థాయిలో అయితే 39వ స్థానంలో ముంబై ఉంది. నవీ ముంబై 36వ స్థానంలోను, థానె 87వ స్థానంలోను ఉన్నాయి. మహారాష్ట్ర పీసీబీ సియాన్, బాంద్రా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు.

డబ్ల్యుహెచ్ఓ ప్రమాణాల ప్రకారం పీఎం 10 స్థాయి క్యూబిక్ మీటరుకు 20 మైక్రోగ్రాముల వరకు ఉండొచ్చు. కానీ ముంబైలో మాత్రం సగటున 117 మైక్రోగ్రాములు ఉంది. అయితే 2014 నాటి స్థాయి 136 మైక్రోగ్రాముల కంటే మాత్రం కొంతవరకు పరిస్థితి మెరుగైనట్లే చెప్పుకోవాలి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో కాలుష్యం బాగా పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వాహనాల సంఖ్యమీద పరిమితి లేకపోవడం.. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో వాహనాల కొనుగోళ్లు పెరగడం కారణంగానే కాలుష్యం కూడా పెరుగుతోందంటున్నారు.

మరిన్ని వార్తలు