త్వరలో భారత్‌కు ముంబై ఉగ్రదాడి నేరస్తుడు?

15 Jan, 2019 02:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: 2008 ముంబై ఉగ్రదాడిలో విచారించేందుకు పాకిస్తానీ కెనడియన్‌ తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను 2021లోపే భారత్‌కు రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షికాగోలో నివసించే రాణాను ముంబై ఉగ్రదాడికి సంబంధించి 2009లో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు సహకరించినట్లు విచారణలో బయటపడటంతో 2013లో కోర్టు రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడి శిక్షా కాలం డిసెంబర్‌ 2021 లో ముగియనుంది.

ఈ కేసులో రాణాను విచారించేందుకు భారత ప్రభుత్వం అమెరికా అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతోంది. అయితే ముంబై ఉగ్రదాడికి సంబంధించే రాణా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుండటంతో.. అదేకేసు విచారణపై భారత్‌ కు అతన్ని అప్పగించే అవకాశం లేదు. దీంతో భారత ప్రభుత్వం ఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ, చాబాద్‌ హౌస్‌లపై దాడి కేసులతోపాటు ఫోర్జరీ కేసుపై భారత్‌కు రప్పించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికాలో పర్యటించిన సమయంలో ఇరు దేశాల మధ్య ఉన్న పలు అధికారిక విధానాల్లో సడలింపు చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఎలాగైనా రాణాను శిక్షాకాలం పూర్తయ్యేలోపే భారత్‌కు రప్పించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు