ముంబై నీళ్లు అమోఘం

17 Nov, 2019 03:58 IST|Sakshi

మిగిలిన మెట్రోల్లో అధ్వానం

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) చేసిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద ముంబై నగర నల్లా నీళ్లే స్వచ్ఛమైనవని తేలింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైతోపాటు 20 రాష్ట్రాల రాజధానుల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనిపై మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ స్పందిస్తూ.. సర్వే జరిపిన అన్ని నగరాల్లోకెల్లా ఒక్క ముంబై నగర నమూనాల్లోనే అవసరమైన 11 బీఎస్‌ఐ పరామితుల నాణ్యత ఉన్నట్లు తేలిందన్నారు.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైపులు, నల్లాల నాణ్యతను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని పేర్కొన్నారు. బీఐఎస్‌ ప్రమాణాలు అందుకోవడంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలు విఫలమయ్యాయని తేలగా, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అమరావతి, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా, చండీగఢ్, గుహవాటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్మూ, డెహ్రాడూన్‌ కూడా ఈ ప్రమాణాలు అందుకోలేకపోయాయని తెలుస్తోంది. సర్వే జరిపిన బీఐఎస్‌ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ మాట్లాడుతూ.. మూడో దశ సర్వేను ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, 100 స్మార్ట్‌ సిటీల్లో జరపనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు