గుర్రమెక్కావా? అయితే చచ్చావే..

29 Apr, 2018 02:24 IST|Sakshi

ఒకప్పుడు.. వాళ్లు వీధుల్లో నడిస్తే మట్టి మలినమవుతుందన్నారు.. అడుగులను చెరిపేసేందుకు వెనక తాటాకులు కట్టుకోమన్నారు.. ఉమ్మి నేలపైపడ్డా అరిష్టమేనని మూతికి ముంత తగిలించి తిరగమన్నారు.. వారి మేనిని సోకే గాలిని మళ్లించలేమనుకున్నారేమో.. ఊరుఊరునే తూర్పుకి తరలించేశారు.. కాలం మారిందని.. ఇప్పుడా పరిస్థితి లేదనుకుంటున్నారేమో.. దళితులపై దాష్టీకానికి తాజా తార్కాణం గుజరాత్‌లో వెలుగు చూసింది.. గుర్రమెక్కాడని.. పట్టుమని పాతికేళ్లయినా నిండని యువకుడిని పొట్టన బెట్టుకున్నారు.

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలోని తంబి ఓ కుగ్రామం.. అక్కడ నివసించే ప్రదీప్‌ రాథోడ్‌ అనే యువకుడు.. చాలా ముచ్చటపడి.. తండ్రి చెవినిల్లు కట్టి మరీ ఓ గుర్రాన్ని కొనుక్కున్నాడు. అప్పుడప్పుడూ గుర్రమెక్కి సవారీకి వెళ్లడమూ ప్రదీప్‌కు ఇష్టమైన పని. ఇది కాస్తా.. అక్కడి రాజ్‌పూత్‌లకు కంటగింపుగా మారింది. అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గుర్రం దిగు, లేదా నీ కడుపులో బల్లేలు దిగుతాయన్నారు. ఆ ఊళ్లో వాళ్లే కాదు పక్క ఊళ్లలోని వాళ్లు కూడా బెదిరింపులకు దిగారు. నువ్వు గుర్రం ఊసెత్తొద్దని.. అయినా వింటేనా? నా గుర్రం.. నా ఇష్టం అన్నాడు ప్రదీప్‌.

షేడెడ్‌ జీన్స్‌ వేసుకుని, కాలుమీద కాలేసుకుని, గుర్రం మీద దర్జాగా రాజులా కూర్చొని ఫొటోకి ఫోజు కూడా ఇచ్చాడు ఆత్మగౌరవం కలిగిన ఆ కుర్రాడు. అంతే అగ్రవర్ణాలకి కడుపులో కాలింది. ఒక రోజు.. ఠీవీగా ప్రదీప్‌ని ఎక్కించుకుని వెళ్లిన గుర్రం ఒంటరిగా తిరిగొచ్చింది. రాథోడ్‌ తండ్రి గుండెలు గుభేలుమన్నాయి. యజమాని ప్రదీప్‌ రాథోడ్‌ని చంపేశారు. ఈ ఘటన గత నెలాఖరున జరిగింది. ప్రదీప్‌ ఒక్కడే కాదు సుమా! గుజరాత్‌లో ఇలాంటి చావులు కొత్తకాదు.

అమ్మాయిలపై అకృత్యాలు అంతకన్నా కొత్తకాదు. అక్కడ భూస్వాములైన క్షత్రియులు చెప్పిందే శాసనం. కాదూ కూడదంటే రాథోడ్‌లాగే తలెగరేసిన వారి తలలు తెగనరికేస్తారు. కేసులేవీ ఠాణాలకు ఎక్కనూ ఎక్కవు. ఇది అన్యాయమని ఎవరైనే ప్రశ్నిస్తే ‘అబ్బే ఆ కుర్రాడంత మంచోడేం కాదు. గతంలో ఎప్పుడో ఓ అమ్మాయి ముందు పిల్లిమొగ్గలు వేసిన ‘దుష్ట చరిత్ర’కూడా ఉంద’ని కాకమ్మ కబుర్లు చెప్పే ఘటికులు అక్కడి ఖాకీలు.  

మరిన్ని వార్తలు