త్వరలోనే స్వదేశానికి వస్తా : ముషార్రఫ్

22 Jun, 2018 07:19 IST|Sakshi
పర్వేజ్ ముషార్రఫ్ (ఫైల్‌ ఫోటో)

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి తన సొంత దేశం రావాలని ప్రయత్నిస్తున్నారు. జూన్‌ 25న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ పాక్‌ సుప్రీంకోర్టు తనను ఏక్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని, తాను పాక్‌కు తిరిగి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ముషార్రఫ్ భావించారు. ఇటీవల పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పాక్‌కి తిరిగి రావచ్చని షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

మొదట తన ముందు హాజరైన తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సకిబ్ నసీర్‌ పేర్కొన్నారు. తనను స్వదేశం రప్పించి అరెస్ట్‌ చేసేందుకే సుప్రీంకోర్టు ఆ సందేశం పంపిందని ముషార్రఫ్ వ్యాఖ్యానించారు. తనకు పాక్‌ రావాలని ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ అంశంపై మాట్లాడుతూ.. పోటీ చేసేందుకు తన పార్టీ ఆల్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ తరఫున రెండు స్థానాల్లో నామినేషన్‌ పత్రాలను సమర్పించానని, ఎన్నికల అధికారి వాటిని తిరిస్కరించారని తెలిపారు. తాను పిరికివాడిని కాదని ప్రపంచం మొత్తం తెలుసునని, త్వరలోనే దేశానికి తిరిగి వస్తానని ముషార్రఫ్ పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముషార్రఫ్ 2016లో దేశం విడిచి వెళ్లి రహస్యంగా దుబాయ్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు