వీర జవాన్లకు అసలైన నివాళి... 11 ఏళ్ళ చిన్నారి సాయం!

20 Feb, 2019 16:38 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 40 మంది భద్రతాదళ సభ్యల ప్రాణాలను బలిగొన్న తీవ్రవాదుల అమానవీయ ఘటన యావత్‌ దేశాన్నీ కుదిపేసింది. మాతృదేశ పరిరక్షణలో ప్రాణాలను ఫణంగా పెట్టిన వీరజవాన్ల జీవన గాధలు వయోభేదం లేకుండా మనసున్న ప్రతివారినీ కుదిపేశాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే భోపాల్‌ కి చెందిన చిన్నారి ముష్కాన్‌ అహిర్‌వార్‌. యుద్ధభూమిలో భారత సైనికుల వీరమరణం ప్రతి గుండెనీ తట్టిలేపినట్టుగానే మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌ కి చెందిన 11 ఏళ్ళ చిన్నారి ముష్కాన్‌ ఈ ఘటనతో తీవ్రంగా చలించిపోయింది. భోపాల్‌ లోని దుర్గానగర్‌ కి చెందిన ఈ అమ్మాయి పుట్టిన రోజు ఫిబ్రవరి 15. అంటే సరిగ్గా పుల్వామా దాడి జరిగిన ఒక రోజు తరువాత ఈ చిన్నారి పుట్టిన రోజు. తన పుట్టిన రోజుకోసమే  యేడాదంతా పెద్దవాళ్ళిచ్చిన ప్రతి పైసా తన బొమ్మ కుండీలో దాచుకుంది. అయితే పుల్వామా ఘటనతో ఆ మొత్తాన్ని సైనిక్‌ కల్యాణ్‌కి దానం చేసి చిన్నవయస్సులోనే తన పెద్దమనసును చాటుకుంది. 

జవాన్ల మరణానికి కదలిపోయిన ఈ చిన్నారి తను పొదుపు చేసుకున్న 680 రూపాయలు మొత్తాన్నీ, తన స్నేహితుల వద్ద సేకకరించిన 1100 రూపాయలు మొత్తాన్ని కలిపి విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కోసం ఏర్పాటు చేసిన సైనిక్‌ కల్యాణ్‌ ఫండ్‌ కి ఇచ్చి,  శెభాష్‌ అనిపించుకుంది. జిల్లా సైనిక్‌ కల్యాణ్‌ కార్యాలయంలోని సూరింటెండెంట్‌కి ఈ డబ్బులను ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది. నిజానికి ఆరవతరగతి చదువుతోన్న ముస్కాన్‌లో ఈ సేవాగుణం ఈ ఘటనతోనే మొదలు కాలేదు. ‘బాల్‌ పుస్తకాలయ్‌’ పేరుతో మురికివాడల పిల్లలకోసం ముష్కాన్‌ తన ఇంటి నుంచే ఒక గ్రంథాలయాన్ని నడుపుతోంది. అయితే దేశ రక్షణ కోసం తీవ్రవాదుల దాడుల్లో మన వీరజవాన్లు ప్రాణాలు ఫణంగా పెడుతోంటే నేను  నా పుట్టిన రోజుని ఎలా జరుపుకోవాలని ఎదురు ప్రశ్నించడం ఆ చిన్నారి చైతన్యానికి అద్దం పడుతోంది. 
 

మరిన్ని వార్తలు