అయోధ్య తీర్పు: తెరపైకి కొత్త డిమాండ్‌!

13 Nov, 2019 13:59 IST|Sakshi

లక్నో : గతంలో అయోధ్యలో ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల్లోనే మసీదు నిర్మాణానికి కూడా భూమిని కేటాయించాలని ముస్లిం వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలా జరగని పక్షంలో తమకు ఐదెకరాల భూమి అక్కర్లేదని స్పష్టం చేశాయి. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ క్రమంలో తొలుత సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించిన ముస్లిం లా బోర్డు.. అటుపిమ్మట చర్చల అనంతరం తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది. రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయబోమని స్పష్టం చేసింది. దీంతో మసీదు నిర్మాణానికి స్థల కేటాయింపు విషయమై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో ప్రధాన కక్షిదారు ఇక్బాల్‌ అన్సారీ మాట్లాడుతూ.. ఒకవేళ తమకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే.. తాము కోరిన చోటే కేటాయించాలని పేర్కొన్నారు. ‘మాకు అనువైన చోట.. ఆ 67 ఎకరాల్లోనే స్థలం కేటాయించాలి. అప్పుడే మేం దానిని స్వీకరిస్తాం. లేదంటే తిరస్కరిస్తాం. బయటకు వెళ్లండి. అక్కడే మసీదు నిర్మించుకోండి అనడం సరైంది కాదు కదా’ అని పేర్కొన్నారు. ఇక ఈ వివాదంలో మరో కక్షిదారు హాజీ మహబూబ్‌, అయోధ్య మున్సిపల్‌ కార్పోరేషన్‌ కార్పోరేటర్‌ హాజీ అసద్‌ అహ్మద్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘ మాకు ఇలాంటి తాయిలాలు అక్కర్లేదు. మేము అడిగిన చోట మసీదు నిర్మాణానికి భూమి ఇస్తారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలి’ అని అసద్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు.

ఇక మరికొంత మంది ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. ‘మా మనోభావాలను కోర్టు, ప్రభుత్వాలు గౌరవించినట్లయితే 18వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు ఖాజీ ఖుద్వా సమాధి ఉన్న ప్రాంతంలోనే భూమి కేటాయించాలి. మేం ఇన్నాళ్లు బాబ్రీ మసీదు కోసమే పోరాడాం. భూమి కోసం కాదు. మేం కోరిన చోట భూమి ఇవ్వనట్లయితే.. మాకు కేటాయిస్తానన్న భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చేస్తాం’ అని పేర్కొంటున్నారు. మరోవైపు యూసఫ్‌ ఖాన్‌ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల వివాదానికి తెరపడిందని హర్షం వ్యక్తం చేశారు. ‘మేం ప్రార్థనలు చేసుకునేందుకు అయోధ్యలో ఇప్పటికే ఎన్నో మసీదులు ఉన్నాయి. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇంతటితో ఈ వివాదం ముగిసింది. మసీదు నిర్మాణం కోసం భూమి అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తమకు కేటాయించిన భూమి విషయమై చర్చించేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డు నవంబరు 26న లక్నోలో సమావేశం కానుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు