‘నా ముస్లిం సోదరులే నన్ను కాపాడారు’

28 Feb, 2020 12:20 IST|Sakshi

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన పెళ్లి

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన వేళ జరిగిన ఓ వివాహం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని మరోసారి నిరూపించింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... సావిత్రి ప్రసాద్‌ అనే యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో మంగళవారం పెళ్లి వేడుక జరిపించేందుకు ఆమె తండ్రి బోడే ప్రసాద్‌ ఏర్పాట్లు చేశాడు. అయితే ఆదివారం సాయంత్రం నుంచే అక్కడ అల్లర్లు చెలరేగడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు కూడా లేకపోవడంతో పెళ్లి ఆగిపోతుందేమోనని మదనపడ్డారు.(ఢిల్లీ అల్లర్లు: మిరాకిల్‌ బాబు..!)

ఈ క్రమంలో పొరుగునున్న ముస్లిం కుటుంబాలు వారికి అండగా నిలిచాయి. వివాహ తంతు సాఫీగా సాగేలా సావిత్రి కుటుంబానికి సహాయం అందించాయి. ఈ విషయం గురించి సావిత్రి తండ్రి బోడే ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ ఈ అల్లర్ల వెనుక ఉన్నది ఎవరో మాకు తెలియదు. మేం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నాం. మా చుట్టూ అన్నీ ముస్లిం కుటుంబాలే ఉన్నాయి. ఏనాడు మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. హిందూ, ముస్లింల మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. ఈరోజు మా పక్కింటి వాళ్ల సహాయంతోనే నా కూతురి పెళ్లి జరిగింది. ఢిల్లీలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మేం శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం’’అని పేర్కొన్నాడు.(ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ)

ఇక వధువు సావిత్రి మాట్లాడుతూ.. ‘‘చేతులకు మెహందీ, ఒంటి నిండా పసుపుతో ఎంతో ఆశగా పెళ్లి వేడుక కోసం ఎదురు చూశాను. కానీ ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో నా ఆశలు చెల్లాచెదురయ్యాయి. అయితే నా ముస్లిం సోదరులే నన్ను కాపాడారు’’ అని వారికి కృతఙ్ఞతలు తెలిపారు. కాగా ఈశాన్య ఢిల్లీలో తలెత్తిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆర్థిక సహాయం ప్రకటించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు