ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సంచలన నిర్ణయం

17 Nov, 2019 15:32 IST|Sakshi

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌  లా బోర్డు (ఎఐఎంపీఎల్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎఐఎంపీఎల్‌బీ నిర్ణయించింది. అలాగే మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో ఇవ్వబోయే ఐదెకరాల భూమిని కూడా ముస్లిం లా బోర్డు నిరాకరించింది. తమకు ఆ భూమి అవసరం లేదని తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై సమీక్షించిన బోర్డు సభ్యులు.. తీర్పును సవాలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్‌ ఎప్పుడు వేయాలనేది మాత్రం వారు వెల్లడించలేదు. వారి తరఫున న్యాయవాదులతో మాట్లాడిన అనంతరం తేదీని వెల్లడిస్తామని తెలిపారు. వీరితో భేటీలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా పాల్గొన్నారు.

కాగా అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. అలాగే అయోధ్యలోనే ముస్లింలు మసీదు నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం వారికి ఐదెకరాల భూమిని కేటాయించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును పలు ముస్లిం సంఘాలు మినహా.. దేశంలోని అన్ని వర్గాల వారు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఎఐఎంపీఎల్‌బీ దాఖలు చేయబోయే సమీక్ష పిటిషన్‌ను సుప్రీం పరిగణిస్తుందా లేక విచారణకు నిరాకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
 

మరిన్ని వార్తలు