యోగి కాలేజీకి ముస్లిం ప్రిన్సిపాల్

19 Apr, 2017 18:21 IST|Sakshi
యోగి కాలేజీకి ముస్లిం ప్రిన్సిపాల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనగానే ఒక్కసారిగా హిందూ అతివాదిని ముఖ్యమంత్రి ఎలా చేస్తారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. కానీ, ఆయన జీవనశైలి ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆయన నెలకొల్పిన ఓ కాలేజీకి ముస్లిం ప్రిన్సిపాల్ ఉన్నారు. 1999 సంవత్సరంలో తన సొంత జిల్లా అయిన పౌరిలో యోగి ఈ కాలేజీని నెలకొల్పారు. దానిపేరు మహాయోగి గురుగోరఖ్‌నాథ్ డిగ్రీ కాలేజి. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కాలేజీని ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల జాబితాలో చేర్చారు.

ఈ కాలేజీలో కుల మతాలు, రంగు వేటినీ పట్టించుకోరని.. వాటి ఆధారంగా వివక్ష ఉండబోదని కాలేజి ప్రిన్సిపాల్ అఫ్తాబ్ అహ్మద్ తెలిపారు. ఇది ఇక్కడి పర్యావరణం లాగే చాలా స్వచ్ఛమైనదని ఆయన అన్నారు. ఆయన గదిలో వివిధ స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలు, కొంతమంది హిందూ దేవతల ఫొటోలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 150 మంది విద్యార్థులున్నారని, వాళ్లలో ఎక్కువమంది అమ్మాయిలేనని అహ్మద్ చెప్పారు. ఇక్కడ దేశవ్యాప్తంగా నెట్ క్వాలిఫై అయిన అధ్యాపకులను మాత్రమే నియమిస్తామని, తమ కాలేజీకి హెచ్ఎన్‌బీ గర్వాల్ యూనివర్సిటీ గుర్తింపు ఉందని తెలిపారు. జిల్లా మొత్తమ్మీద ఇదొక్కటే డిగ్రీ కాలేజి. యోగి ఆదిత్యనాథ్‌ తమ్ముడైన మహేందర్ సింగ్ బిష్త్ ఈ కాలేజికి అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వివక్ష అన్న పదం వినిపిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఇక్కడ ఎలాంటి మత సిద్ధాంతాలను బోధించరని, ఇక్కడి ముస్లిం ప్రిన్సిపాల్ ప్రతిసారీ ముందుగా తనతోనే హోలీ ఆడతారని తెలిపారు.

మరిన్ని వార్తలు