శివుడి గుడిలో నిఖా

13 Mar, 2014 05:39 IST|Sakshi
శివుడి గుడిలో నిఖా

లక్నో: కొన్నాళ్లుగా మతహింసకు సాక్షిగా నిలుస్తున్న ఉత్తరప్రదేశ్‌లో మతసామరస్యం వెల్లివిరిసింది. శివుడి సన్నిధిలో జరిగిన నిఖా.. హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది... బులంద్‌షహర్ జిల్లా రాంనగర్ గ్రామానికి చెందిన ఇక్బాల్‌ఖాన్‌కు ఇద్దరు కూతుళ్లు నజ్మా, ముజ్మా...వారికి అదే జిల్లాకు చెందిన ఇద్దరు యువకులతో పెళ్లి నిశ్చయమైంది. మొదటగా తన ఇంట్లోనే కూతుళ్ల నిఖా చేయాలనుకున్నా ఇక్బాల్ తర్వాత తన కూతుళ్ల పెళ్లి మతసామరస్యానికి చిహ్నంగా ఉండాలని భావించాడు. వెంటనే ఊళ్లోని శివాలయంలో నిఖా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.
 
 అందుకు అనుగుణంగా ఊళ్లోని రెండు మతాలకు చెందిన పెద్దలతో మాట్లాడి వారి ఆమోదాన్ని కూడా పొందాడు. పెళ్లి కొడుకులు కూడా శివాలయంలో నిఖా చేసుకోడానికి సంతోషంగా అంగీకరించారు. ఇక గుడిలోని పూజారులయితే సాదరంగా ఆహ్వానించారు. ఇంకేముంది.. కాసేపు మతాన్ని పక్కన పెట్టి ఊళ్లోని జనమంతా  శివుడిగుడిలో జరిగే నిఖాకు పెద్దయెత్తున తరలివచ్చారు. రెండు మతాలకు చెందిన వందల మంది సాక్షిగా...శివుడి సన్నిధిలో... ఇస్లాం సంప్రదాయాలకు అనుగుణంగా... ఖాజీల మంత్రోచ్చారణల మధ్య... సోమవారం ఇక్బాల్ ఇద్దరు కూతుళ్ల నిఖా ఘనంగా జరిగింది. చివరగా, ఊళ్లో జనమంతా వధూవరులకు కన్నీటి వీడ్కోలు పలికి తమ మతసామరస్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.

మరిన్ని వార్తలు