‘మందిర్ నిర్మాణానికి వారు వ్యతిరేకం కాదు’

16 Nov, 2017 18:21 IST|Sakshi

సాక్షి,అయోధ్య: రామ మందిర నిర్మాణాన్నిముస్లింలు సైతం వ్యతిరేకించడం లేదని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. ‘కొన్ని సార్లు అయోధ్య సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో కనిపించకపోయినప్పటికీ, మన యువత, ఇరు వర్గాల ప్రజలు తలుచుకుంటే ఇది సాధ్యమే’ నన్నారు. మందిర్‌ వివాదానికి ముగింపు పలికే క్రమంలో రవిశంకర్‌ గురువారం అయోధ్యలో మతపెద్దలు సహా పలువురితో ముచ్చటించారు. డిసెంబర్‌ 5న అయోధ్య కేసును సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని అయితే ఇవి ఎప్పటికి తుదిరూపు తీసుకుంటాయో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో ప్రతిఒక్కరితో సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశంలో తనకు ఎటువంటి అజెండా లేదని అందరి అభిప్రాయాలను కూలంకషంగా తెలుసుకుంటానన్నారు. కాగా రవిశంకర్‌ పర్యటనను బీజేపీ నేతలు స్వాగతించగా, విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

అయోధ్య అంశంపై అందరి మనోభావాలను తెలుసుకునే ముందు రవిశంకర్‌ బుధవారం లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు