మెట్రోకు ‘ప్లాట్‌ఫాం’ కష్టాలు..!

22 Jun, 2014 22:38 IST|Sakshi
మెట్రోకు ‘ప్లాట్‌ఫాం’ కష్టాలు..!

సాక్షి, ముంబై: మెట్రో ప్రయాణికులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇకపై ఘాట్కోపర్ మెట్రో స్టేషన్ మెయిన్ గేట్‌కు వెళ్లాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టికెట్ కొనాల్సి ఉంటుంది. మెట్రో ప్రయాణికులు ఘాట్కోపర్ స్టేషన్‌కు వెళ్లాలంటే సెంట్రల్ రైల్వేకు చెందిన ఘాట్కోపర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది.
 
అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సెంట్రల్ రైల్వేకి చెందినది కావడంతో మెట్రో ప్రయాణికులు ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.  ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై అకస్మాత్తుగా మెట్రో ప్రయాణికుల వల్ల రద్దీ పెరిగిపోవడంతో లోకల్ రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో తమ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగిస్తున్న మెట్రో ప్రయాణికులు ఇక మీదట ఫ్లాట్‌ఫాం టికెట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో వారంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో టికెట్ విండో, ఏటీవీఎంలను ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నామన్నారు.
 
కాగా మెట్రో ప్రారంభంలో సెంట్రల్ రైల్వే మెట్రో ప్రయాణికులకు తమ పరిధిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకునేందుకు అనుమతించింది. కానీ ఇప్పుడు మెట్రో ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకోవాలంటే ప్లాట్‌ఫాం టికెట్, లేదా రైల్వే పాస్ తప్పనిసరి చేశారు. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోకుంటే మెట్రో ప్రయాణికులకు జరిమానా విధించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ తెలిపారు.  రైల్వే ప్రవాసీ సంఘ్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా మాట్లాడుతూ... ఈ విషయమై రైల్వే అధికారులతో త్వరలోనే  మాట్లాడతానన్నారు.
 
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అదనంగా వేల సంఖ్యలో ప్రయాణికుల భారాన్ని మోయలేదని అభిప్రాయపడ్డారు. మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు