అమ్మకు రికార్డు మెజారిటీ ఖాయమేనా!

27 Jun, 2015 18:22 IST|Sakshi
అమ్మకు రికార్డు మెజారిటీ ఖాయమేనా!

చెన్నై: ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుల్లో శనివారం జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఫలితం 'అమ్మ'కు అనుకూలంగా ఉండేఅవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మొత్తం 65 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

 

ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోందని, పోలింగ్ శాతం ఒకటి రెండు అంకెలకు పెరగవచ్చని పేర్కొన్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 230 పోలింగ్ కేంద్రాలద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

డీఎంకే, పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వంటి ప్రధాన పక్షాలన్నీ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండటంతో సీపీఐ- సీపీఎంల ఉమ్మడి అభ్యర్థి కేఆర్ రామస్వామి ఒక్కరే జయకు ప్రధాన పోటీదారుగా మారారు. మరో 26 మంది ఇండిపెండెట్లు కూడా బరిలో ఉన్నప్పటికీ వారి ప్రభావం అంతంతమాత్రమే.

 

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో మళ్లీ ఆమె సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలుచేయడంతో జయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుప్రీంకోర్టులో కూడా తమ అధినేత్రి కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఏఐడీఎంకే కార్యకర్తలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు