-

సీడీవీ వైరస్‌తోనే గిర్‌ సింహాల మృతి

6 Oct, 2018 03:57 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో చనిపోయిన 23 ఆసియా జాతి సింహాల్లో  ఐదు సింహాలను ప్రమాదకర కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌(సీడీవీ) బలికొందని భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ–పుణె) తెలిపాయి. సింహాల మృత కళేబరాల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఈ ప్రమాదకరమైన వైరస్‌ కారణంగా తూర్పు ఆఫ్రికాలో ఉన్న సింహాల్లో 30 శాతం అంతరించిపోయాయని పేర్కొన్నాయి. గిర్‌ అభయారణ్యంలో గత నెల 12 నుంచి ఇప్పటివరకూ 23 సింహాలు చనిపోయాయి. ఈ నేపథ్యంలో నమూనాలను సేకరించిన భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌).. సీడీవీ వైరస్‌ను ధ్రువీకరించింది.

గాలితో పాటు ప్రత్యక్షంగా తాకడం ద్వారా జంతువుల్లో ఈ వైరస్‌ సోకుతుంది. దీంతో అధికారులు మిగతా సింహాలకు ఈ వ్యాధి వ్యాపించకుండా వాటిని వేరే జూలకు తరలించారు.  వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఐసీఎంఆర్‌ విజ్ఞప్తితో కేంద్రం సీడీవీ టీకాను శుక్రవారం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. గిర్‌ అభయారణ్యంలో దాదాపు 600 ఆసియా జాతి సింహాలున్నాయి. సాధారణంగా సీడీవీ వైరస్‌ పెంపుడు కుక్కల్లో కనిపిస్తుంది. తోడేలు, నక్క, రకూన్, ముంగిస, రెడ్‌ పాండా, హైనా, పులి, సింహం వంటి మాంసాహార జంతువులకూ సోకుతుంది. ఇది సోకిన జంతువుల్లో 50 శాతం చనిపోతాయి. చికిత్స ద్వారా కోలుకున్నా చూపును కోల్పోవడం,  మూర్ఛ రావడం, వేటాడే శక్తిలేక నిస్తేజంగా మారిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్‌ మనుషులపై ప్రభావం చూపదు.

మరిన్ని వార్తలు