టీవీ చానల్‌తో మాట్లాడుతున్న విద్యార్థిని చితక్కొట్టారు

8 Mar, 2019 09:19 IST|Sakshi

లక్నో: దేశంలో విద్వేషపూరిత దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లక్నోలో డ్రైఫ్రూట్స్‌ విక్రయించే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద గ్రూపునకు చెందిన కొందరు బుధవారం సాయంత్రం కర్రలతో దాడి చేసిన ఘటన మరువకముందే.. అలలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని జీర్ణించుకులేకపోయిన కొందరు వ్యక్తులు ఓ విద్యార్థిని చితక్కొట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రోజున ఓ వార్త చానల్‌ ముజఫర్‌నగర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మాట్లాడించే కార్యక్రమం చేపట్టింది. ఆ సముహంలోని ఓ విద్యార్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో ఓ గ్రూప్‌ అతనిపై దాడికి దిగారు. అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఆ టీవీ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. ఈ ఘటనను కొందరు వ్యక్తులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దాడి అనంతరం బాధితుడు మాట్లాడుతూ.. ‘కేవలం ఉద్యోగాలు లేవని మాట్లాడినందుకు నాపై దాడి జరిగింది. వాళ్లు నన్ను టెర్రరిస్టు అంటూ.. భారత్‌కు, బీజేపీకి వ్యతిరేకివి అంటూ దాడికి తెగబడ్డారు. ముజఫర్‌నగర్‌ పోలీసులు ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీడియోలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ’ని తెలిపారు. కాగా, ఈ ఘటనను హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు