మహిళను కావడమే నేను చేసిన తప్పు: ప్రీతి జింటా

2 Jul, 2014 13:53 IST|Sakshi
మహిళను కావడమే నేను చేసిన తప్పు: ప్రీతి జింటా

ఒకప్పటి తన వ్యాపార భాగస్వామి నెస్ వాడియాపై పోలీసుకేసు పెట్టడం అపరిపక్వత కాదని, తాను చేసిన తప్పల్లా.. మహిళను కావడమేనని సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా చెప్పింది. తరచుగా తనను తిట్టడం, బెదిరించడం, అవమానించడం లాంటివి అయిన తర్వాతే తాము విడిపోయే దశకు వచ్చామని తెలిపింది. నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడంటూ ప్రీతి ఇటీవలే ఓ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. జనం కాస్తంత ఓపిక పడితే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె తెలిపింది. తాను గతంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని, అది తనకు నప్పని విషయమని ప్రీతి అంది. తాను బాధ్యతాయుతమైన పౌరురాలినని, కేవలం మహిళను అయినందుకే తనను ఇన్నాళ్లుగా వేధించాడని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది.

మహిళలను హింసించడం సరికాదని, ఇంత జరుగుతున్నా జనం మాత్రం మహిళలనే తప్పుబడుతున్నారని వాపోయింది. తాను తనకోసమే పోరాటం చేస్తున్నానని, ఇది ఏ ఒక్క కుటుంబంపై పోరాటం కాదని, కేవలం ఒక్క వ్యక్తిమీద చేస్తున్నదేనని ప్రీతి జింటా చెప్పింది. తానేమీ ప్రెస్మీట్లు పెట్టి ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని, పైపెచ్చు.. తన వ్యక్తిగత రహస్యాలను గౌరవించాలని కూడా కోరానని తెలిపింది.

మరిన్ని వార్తలు