బడ్జెట్‌ విశేషాలు : 72 సంవత్సరాలు.. 76 సెషన్లు

1 Feb, 2019 10:42 IST|Sakshi

న్యూఢిల్లీ : మరి కొద్ది గంటల్లో మోదీ ప్రభుత్వం కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మన దేశంలో 26 మంది ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దాదాపు 76 బడ్జెట్‌ సెషన్లు జరిగాయి. బడ్జెట్‌కి సంబంధించి దాదాపు 72 ఏళ్లుగా మన దేశంలో పాటిస్తున్న కొన్ని సంప్రదాయాలను ఓ సారి చూడండి.

1. నేడు తాత‍్కలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ తయారికి దాదాపు 5 నెలల సమయం పడుతుంది. గతంలో ఆర్థిక సంవత్సరం మార్చి - ఏప్రిల్‌ వరకూ ఉన్నప్పుడు ఫిబ్రవరి నెలాఖరు వరకూ కూడా బడ్జెట్‌ తయారి ప్రక్రియ కొనసాగేది. కానీ మోదీ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరాన్ని ఫిబ్రవరి - మార్చికి మార్చింది. ఇప్పుడు జనవరి చివరి రోజు వరకూ బడ్జెట్‌ తయారీ కొనసాగుతుంది.

2. కొత్త డాటా ప్రకారం తొలుత కీలక అంశాలకు కేటాయింపులు ముగిసిన తర్వాత దీన్ని ఆర్థిక మంత్రికి అంద జేస్తారు. ఈ వివరాలన్నింటిని మార్పు చేయడానికి వీలులేని నీలం రంగు పేపర్‌లో చేర్చి ఆర్థికమంత్రికి ఇస్తారు. ఆయన దీన్ని పరిశీలించి తిరిగి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. తన దగ్గర ఉంచుకోవడానికి కుదరదు. ఈ నీలం రంగు బడ్జెట్‌ పేపర్ల సంప్రదాయాన్ని బ్రిటీష్‌ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి తీసుకున్నాం.

3. ఇప్పుడైతే బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడ్తున్నాం. కానీ 1999 వరకూ కూడా బడ్జెట్‌ను ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రకటించేవారు. ఉదయం 11 గంటలకు ప్రకటించే సంప్రదాయాన్ని యశ్వంత్‌ సిన్హా 2001 నుంచి ప్రారంభించారు.

4. బడ్జెట్‌ ప్రసంగం కనీసం ఒక గంటపాటు కొనసాగుతుంది. కానీ 1991లో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సేపు ప్రసంగించారు. దాదాపు 18,650 పదాలు వాడారు. తరువాతి స్థానంలో జైట్లీ నిలిచారు. గత ఏడాది జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ 18,604 పదాలు వాడారు. అతి తక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన వ్యక్తి హెచ్‌ఎమ్‌ పాటిల్‌. 1977లో తన బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా పాటిల్‌ కేవలం 800 పదాలను మాత్రమే వాడారు.

5. ఇక బడ్జెట్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయం వరకూ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఫోన్లను ట్యాప్‌ చేయడం, జామర్స్‌, స్కానర్స్‌, రహస్య కెమరాలను ఏర్పాటు చేస్తారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేవరకూ ఎక్కడ ఎటువంటి సమాచారం లీక్‌ కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. 1950 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది.

6. అన్ని శాఖల వారిగా బడ్జెట్‌ కేటాయింపులు ముగిసాక ఆర్థిక మంత్రి కార్యాలయంలోని బేస్‌మెంట్‌లో ఉన్న ప్రెస్‌లో బడ్జెట్‌ ప్రతులను ముద్రించడం జరుగుతుంది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాడానికి వారం ముందుగా ముద్రణ ప్రారంభమవుతుంది. హల్వా తయారీతో బడ్జెట్‌ ప్రింటింగ్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆర్థికమంత్రి దాదాపు 100 మంది అధికారులకు, సిబ్బందికి ఈ హల్వా తినిపిస్తారు.

7. పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించేవరకూ ఆ శాఖకు సంబంధించిన సిబ్బందిని నార్త్‌ బ్లాక్‌ పరిసరాల్లోనే ఉంచుతారు. వారు బయటకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సెల్‌ ఫోన్లు వాడటం వంటివి నిషేధం. వారికి వడ్డించే ఆహారాన్ని కూడా పరీక్షిస్తారు. వైద్యులతో పాటు ఇంటిలిజెన్స్‌ అధికారులు, పోలీసుల భద్రత ఏర్పాటు చేస్తారు.

8. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ పత్రాలున్న రెడ్‌ కలర్‌ లెదర్‌ బ్యాగ్‌ను పార్లమెంట్‌ బయట ప్రెస్‌ ఫోటోకాల్‌ నిమిత్తం ప్రదర్శిస్తారు. ఈ సంప్రదాయం రాణి విక్టోరియా కాలం నుంచి కొనసాగుతుంది. యశ్వంత్‌ సిన్హా, ప్రణబ్‌ ముఖర్జి వాడిన లెదర్‌ బ్యాగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి.

9. బడ్జెట్‌ ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రి ప్రసిద్ధి చెందిన వ్యక్తులు చెప్పిన సూక్తులతో ప్రారంభిస్తారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ తన ప్రసంగానికి ముందు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, విక్టర్‌ హ్యూగో సూక్తులను ఉటంకించగా.. పి చిదంబరం వివేకానంద, తిరరువల్లువారు సూక్తులను ప్రస్తావించారు. వీరికి విరుద్ధంగా ప్రణబ్‌ ముఖర్జీ కౌటిల్యుడు, షేక్స్‌పియర్‌ సూక్తులను ఉటంకించారు.

మరిన్ని వార్తలు