టీడీపీ స్క్రిప్టు ప్రకారమే మైసూరా లేఖ

28 Apr, 2016 01:09 IST|Sakshi
టీడీపీ స్క్రిప్టు ప్రకారమే మైసూరా లేఖ

♦ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ
♦ మైనింగ్ లీజు కోసమే బాబు పంచన మైసూరా చేరుతున్నారు
 
 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
తెలుగుదేశం స్క్రిప్టు ప్రకారమే మైసూరారెడ్డి లేఖ ఉందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ముందు ఒక వ్యూహం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దుష్ర్పచారానికి అనుగుణంగా ఈ లేఖ ఉందన్నారు. పెద్దలకు జగన్ విలువివ్వరని, ప్రతినమస్కారం చేయరని, మంచి సంబోధనతో మాట్లాడరంటూ ఎన్నికలముందు టీడీపీ దుష్ర్పచారం చేసిందని, అవే అంశాల్ని ప్రస్తావిస్తూ మైసూరా లేఖ సాగిందన్నారు. టీడీపీ ప్రోద్భలంతోనే లేఖ రాసినట్టు ఉందన్నారు.

‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని జగన్ విడుదల చేసిన నేపథ్యంలో మైసూరాతో రాజీనామా లేఖ రాయించినట్టుగా ఉందన్నారు. జగన్ నివాసానికి టిఫిన్‌కు వెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ కండువా వేసుకోవాల్సివచ్చిందని మైసూరా చెప్పడం హాస్యాస్పదమన్నారు. కుటుంబంలోనూ చిచ్చుపెట్టారని మైసూరా విమర్శించడంలో అర్థం లేదన్నారు.

 మైసూరానే అపరిచితుడు
 కాంగ్రెస్ నుంచి టీడీపీకి, అక్కడినుంచి వైఎస్సార్‌సీపీకి, మళ్లీ టీడీపీకి.. ఇలా పార్టీలు మారుతున్న మైసూరానే అపరిచితుడని పెద్దిరెడ్డి విమర్శించారు. పెద్దల్ని జగన్ గౌరవించరనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీ చెబుతున్న విషయాల్నే లేఖలో ప్రస్తావించడాన్నిబట్టి చూస్తే.. మైసూరా టీడీపీలో చేరనున్నారని స్పష్టమవుతోందన్నారు.

 డబ్బు సాయం చేయమని మిమ్మల్ని అడిగారా?
 ‘‘జగన్‌కు డబ్బు ధ్యాస ఉందని లేఖలో రాశారు. జగన్ ఏనాడైనా డబ్బు సాయం చేయమని మిమ్మల్ని అడిగారా? డబ్బు ధ్యాస మీకుంది కాబట్టే.. సిమెంట్ కంపెనీ లెసైన్సు ఉన్నందువల్ల దానికి మైనింగ్‌లీజు, బ్యాంకులనుంచి రుణాలు తెచ్చుకోవడానికే చంద్రబాబు పంచన చేరుతున్నారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు.

 అవినీతి బాబుకు అర్హత ఉంటుందా?
 కేంద్ర హోంమంత్రిని కలిసే అర్హత జగన్‌కు లేదన్న టీడీపీ విమర్శలపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. రూ.1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు హోంమంత్రిని కలిసే అర్హత ఉండదు తప్ప జగన్‌కు ఎందుకుండదని ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరిగితే బండారం బయటపడుతుందన్నారు. విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోకపోతే అసలు విషయం తెలిసిపోయేదన్నారు. ఇప్పటికైనా సీబీఐ విచారణను తనంతటతాను కోరుకుని ఎలాంటి మతలబులు చేయకుంటే బాబు సచ్ఛీలతను అంగీకరిస్తామన్నారు. జగన్‌పై ఆరోపణలొచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. రాష్ట్రానికి ఎన్ని నిధులు సాధించిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు