రాజ వంశోద్ధారకుడు

8 Dec, 2017 07:09 IST|Sakshi

మా ఆనందానికి అవధుల్లేవు

రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్‌

యదువీర్‌–త్రిషికకు పుత్రోదయంపై రాజకుటుంబం పరవశం

బొమ్మనహళ్లి: సుదీర్ఘ కాలం తరువాత యదు వంశానికి వంశోద్ధారకుడు రావడం చాలా సంతోషంగా ఉంది. మహారాజు యదువీర్‌ భార్య మహారాణి త్రిషికా కుమారి బుధవారం రాత్రి పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. చిన్నారి, మహారాణి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’ అని మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్‌ తెలిపారు. గురువారం బెంగళూరు నగరంలో ఉన్న ఒక ప్రవేట్‌ ఆస్పత్రిలో యదువీర్‌తో కలిసి ప్రమోదాదేవి మీడియాతో మాట్లాడారు. చిన్నారి నామకరణంతో పాటు ఇతర అన్ని విషయాలను శాస్త్రోక్తంగా ఈ నెల 17వ తేదీ తరువాత చేపడతామని చెప్పారు.

పునర్వసు నక్షత్రంలో...
మహారాణి త్రిషికా కుమారి బుధవారం రాత్రి ఇక్కడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రవేట్‌ ఆస్పత్రిలో 9.32 గంటలకు బాబు జన్మనివ్వడం జరిగిందని ఆమె చెప్పారు. తనతో పాటు మా కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నారని, బాబు పునర్వసు నక్షత్రంలో జన్మించాడని,  3 కిలోల బరువు ఉన్నాడని మహారాణి తెలిపారు. మరో రెండు రోజుల తరువాత ఇద్దరినీ ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేస్తారని చెప్పారు.
యదు వంశంలో పుట్టిన బాలుడిని చూసి కన్నడనాడులో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది, మాపైన ఇలాగే అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు రాజమాత తెలిపారు. మైసూరుప్రజలు ఇప్పటికే స్వీట్లు పంపిణీ చేస్తున్నారని, మరిన్ని వివరాలను మైసూరుకు వెళ్ళిన అనంతరం ప్రకటిస్తామని అన్నారు.

చాముండేశ్వరి దయతోనే: యదువీర్‌
యదువీర్‌ మాట్లాడుతూ తల్లి చాముండేశ్వరి మాత దయ వల్ల మాకు బాబు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది, యదు వంశంలో 62 సంవత్సరాల అనంతరం మగసంతానం పుట్టడం మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. జన్మ నక్షత్రం, జాతకం ప్రకారం పేరు పెడతామని, శిశువు చలాకీగా ఉన్నాడని, బాబుకు పెట్టె పేరుతో పాటు పక్కన నరసింహరాజు ఒడెయార్‌ అనే పేరు తప్పకుండా ఉంటుందని మహారాజు తెలిపారు. బాబు చలాకీగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశామని తెలిపారు. తమకు సంతానభాగ్యం చాముండేశ్వరి దేవి కృషాకటాక్షే అని రాసిన లేఖను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు