సీఎం పై 26 ఏళ్ల యువకుడి పోటీ

23 Apr, 2016 12:09 IST|Sakshi
సీఎం పై 26 ఏళ్ల యువకుడి పోటీ

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి కొట్టాయం జిల్లా పుట్టుపల్లి నియోజకవర్గం పై పడింది. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీపై 26 ఏళ్ల యువకుడు పోటీ చేయనున్నాడు. పోటీ చేసిన 10 సార్లు పుట్టుపల్లి  నియోజక వర్గం నుంచి గెలుపొంది 11వ సారి చాందీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. భారత దేశంలోనే యునైటెడ్ నేషన్స్ అవార్డ్ ఫర్ పబ్లిక్ సర్వీస్  అవార్డు అందుకున్న ఏకైక సీఎం చాందీ. అయినా ముఖ్యమంత్రి, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఈ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి.

తనకు పుట్టుపల్లి  నియోజకవర్గ ప్రజలకు అవినాభావసంబంధం ఉందని, నిరాధారమైన ఆరోపణలను వారు నమ్మరని చాందీ తెలిపారు. మరోవైపు 26 ఏళ్ల జేక్ సీ థామస్ను ,73 ఏళ్ల చాందీపై పుట్టుపల్లి  నియోకవర్గం నుంచి సీపీఎం పోటీకి దింపింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యువజన విభాగం నాయకుడిగా ఉన్న థామస్ విద్యార్థి నాయకుడిగా 10 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. తొలిసారి ఏకంగా సీఎం పై పోటీకి దిగే అవకాశాన్ని సీపీఎం కల్పించింది.

'చాందీ పై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు ఏ సీఎం పైనా రావడం ఇక్కడి ప్రజలు చూడలేదు. ప్రభుత్వం పనితీరుపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. పుట్టుపల్లిలో అభివృద్ది పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవడానికి ఇదే సరైన సమయం అని' థామస్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు