శాస్త్రీయ సంగీతంలో జాతీయ రియాల్టీ షో

25 Jul, 2013 01:58 IST|Sakshi

ఆకాశవాణి-దూరదర్శన్-‘స్పిక్‌మెకె’ సంస్థలు, విఖ్యాత నటీమణి షబానా ఆజ్మీ ప్రయోక్తగా జాతీయస్థాయిలో శాస్త్రీయ సంగీతంలో రియాల్టీ షోను నిర్వహిస్తున్నాయి. ‘నాద్ భేద్’ (ద మిస్టరీ ఆఫ్ సౌండ్) అనే ఈ కార్యక్రమం శాస్త్రీయ సంగీతానికి అంకితమైన యువతరం వైవిధ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో టీఆర్‌పి రేటింగ్స్‌తో ఓట్లను లెక్కించడం లాంటి గిమ్మిక్కులకు అవకాశం లేకుండా రూపొందింది.
 
 శివకుమార్‌శర్మ, టి.ఎన్.కృష్ణన్, అమ్జద్ అలీఖాన్, టి.వి.శంకర్ నారాయణ, హరిప్రసాద్ చౌరసియా, విక్కు వినాయక్‌రామ్, పర్వీన్ సుల్తానా, ఆర్.కె.శ్రీకాంతన్ తదితరులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో న్యాయనిర్ణేత లుగా పాల్గొంటారు. ప్రాంతీయస్థాయిలో షోల అనంతరం జాతీయ స్థాయికి ఎంపికైన వారిలో కర్నాటక-హిందుస్తానీ సంగీతంలో ప్రథములుగా నిలిచిన ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల బహుమతిని అందజేస్తారు. 26 ఏళ్ల లోపు వయస్సుగల యువతీ యువకులు ఈ షోలో పాల్గొనేందుకు అర్హులు.
 
 కర్ణాటక-హిందుస్తానీ విభాగాల్లో ‘గాత్రం-వాద్యం- సహ వాద్యం’ అనే అంశాల్లో మొత్తం ఆరు పురస్కారాలుంటాయి. కర్ణాటక సంగీతంలో శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి యువ పురస్కారం- విద్వాన్ షేక్ చినమౌలానా యువ పురస్కారం- విద్వాన్ పాల్‌ఘాట్ అయ్యర్ యువ పురస్కారం, హిందుస్తానీ సంగీతంలో, పండిట్ భీంసేన్ జోషీ యువపురస్కారం-పండిట్ రవిశంకర్ యువ పురస్కారం- ఉస్తాద్ అల్లా రాఖా యువ పురస్కారాలుంటాయి. విజేతలు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక బహూకరిస్తారు.
 
 గాత్ర సంగీతంలో పాల్గొనే అభ్యర్థులను ‘రాగం-కీర్తన-స్వరం-మనోధర్మ రీతిలో పల్లవు’లను 15 నిమిషాల వ్యవధిలో వినిపించవలసినదిగా న్యాయనిర్ణేతలు కోరతారు.
 
 వయొలిన్-మృదంగం-వీణ-వేణువు-కంజీర-మోర్సింగ్-ఘటం-డోలు తదితర వాద్య సం గీత విభాగాల్లో పాల్గొనే సహవాద్యకారులు 15 నిమిషాలసేపు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిం చాల్సి ఉంటుంది. ప్రవేశ రుసుం 150 రూపాయలు. రియాల్టీలో పాల్గొనదలచిన వారు ఈనెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో www.spicmacay.com/naadbhed కి దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు సెల్ ఫోన్ (98480 59020) ద్వారా సంప్రదించవచ్చు.
- జయవంత్ నాయుడు  స్పిక్‌మెకె ప్రతినిధి, హైదరాబాద్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా