అభినందన్‌ మానసిక స్థితిని ఊహించగలను : నచికేత

28 Feb, 2019 19:41 IST|Sakshi

న్యూఢిల్లీ : ఓ గంట క్రితం వరకూ కూడా ప్రతి భారతీయుడి మదిలో ఒకటే ప్రశ్న.. వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ పరిస్థితి ఏంటి.. ఎప్పుడు విడుదల చేస్తారు.. అసలు వదిలేస్తారా.. లేదా అనే అనుమానాలు. వాటన్నింటికి సమాధానం దొరికింది. రేపు అభినందన్‌ను విడుదల చేస్తామంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధ ఖైదీగా పట్టుబడ్డప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఆ సమయంలో సదరు వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందో వివరించారు కార్గిల్‌ వార్‌ హీరో కే నచికేత. అభినందన్‌ విడుదల ప్రకటన కంటే ముందు మీడియాతో మాట్లాడారు నచికేత.

ఈ సందర్భంగా నచికేత, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను ప్రశంసించారు. యుద్ధ ఖైదీగా ఆయన చూపిన స్థైర్యాన్ని కొనియాడారు. అంతేకాక ‘అభినందన్‌ ఒక సాహసోపేత పైలెట్‌ మాత్రమే కాక వృత్తిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. రక్షణ రంగంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే.. స్త్రీ, పురుష బేధం లేకుండా హై కమాండ్‌ ఆదేశాల మేరకు వారి, వారి విధులను అత్యుత్తమంగా నిర్వహించాల్సి ఉంటుంది. ట్రైనింగ్‌లో కూడా ఇదే అంశాన్ని బోధిస్తారు. విపత్కర పరిస్థితుల్లో నిగ్రహం కోల్పోకుండా ఉండటం గురించి కూడా​ ట్రైన్‌ చేస్తారు.. అందుకే యుద్ధ ఖైదీగా పట్టుబడిన వ్యక్తి ఎంతటి హింసనయిన భరిస్తాడు కానీ దేశానికి, సైన్యానికి సంబంధించిన రహస్యాలను మాత్రం చెప్పడ’ని తెలిపారు.

అంతేకాక ‘అభినందన్‌ క్షేమంగా ఇంటికి వస్తాడని నా నమ్మకం. ఇలాంటి కష్ట కాలంలో మనమందరం అతని కుటుంబానికి అండగా నిలవాలి. కానీ దురదృష్టావశాత్తు మీడియా ఈ విషయంలో సరిగా వ్యవహరించలేదు. అత్యుత్సాహంతో అభినందన్‌ యుద్ధ ఖైదీగా పట్టుబడిన వీడియోలను పదే పదే ప్రచారం చేస్తూ ఆ కుటుంబాన్ని మరింత బాధపెట్టింది. ఏది ఏమైనా అభినందన్‌ క్షేమంగా వస్తాడు. రావాలని నేను కోరుకుంటున్నాను’ అని తెలిపారు. అయితే నచికేత మాట్లాడిన కాసేపటికే అభినందన్‌ను రేపు విడుదల చేస్తామంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించాడు.

(చదవండి : కార్గిల్‌ వార్‌లో పాక్‌కి చిక్కిన పైలట్‌.. తర్వాత?)

మరిన్ని వార్తలు