ప్రపంచ నేరాలకు రాజధానిగా చేస్తారా ఏంటి?

16 Feb, 2017 12:54 IST|Sakshi

ముంబయి: నాగ్‌పూర్‌ను బీజేపీ నుంచి రక్షించాలని ప్రజలకు శివసేన పిలుపునిచ్చింది. నాగ్‌పూర్‌లో శాంతిభద్రతల పరిస్థితులు బాగా క్షీణించాయని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మొత్తానికే ఆ పట్టణాన్ని వదిలేశారని, బీజేపీని ఓడించడం ద్వారానే దానిని కాపాడుకోగలమంటూ ఘాటుగా విమర్శించింది. లేదంటే నాగ్‌పూర్‌ను ప్రపంచ నేర సామ్రాజ్యానికి రాజధానిగా చేస్తారని తీవ్ర ఆరోపణలు బీజేపీపై చేసింది.

ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌, ఆయన బీజేపీ నాయకులు కేవలం ముంబయి, పుణె నగరాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కానీ, నాగ్‌పూర్‌ను మాత్రం వదిలేశారు. సమస్యల్లో ముంచారు. నేరాలు బాగా జరుగుతున్నాయి. నాగ్‌పూర్‌ ప్రపంచ నేరాలకు రాజధానిగా మారితే ముందు సమాధానం చెప్పాల్సిది బీజేపీనే అంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా పేర్కొంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నేపథ్యంలో శివసేన చేసిన ఈ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు