కడుపులో మేకులు.. మెడలో బాణం

31 Oct, 2017 14:16 IST|Sakshi

కోల్‌కటా : పశ్చిమ బెంగాల్‌ రెండు వేర్వేరు ఘటనల్లో బాధితులను వైద్యులు సురక్షితంగా రక్షించగలిగారు. ఆపరేషన్‌ చేసి ఓ వ్యక్తి కడుపు నుంచి 600కి పైగా మేకులు బయటకు తీయగా.. మరో ఘటనలో ప్రమాదవశాత్తూ బాణం మెడలోకి దూసుకుపోయిన ఓ బాలికను వైద్యులు రక్షించగలిగారు.
  
కోల్‌క‌తాలోని ఉత్త‌ర 24 ప‌ర‌గ‌ణా జిల్లాలో గోబ‌ర్దంగా ప్రాంతానికి చెందిన ఓ 48 ఏళ్ల‌ స్క్రీజోఫ్రెనియాతో బాధపడుతున్నాడు. మేకులు, మట్టి ఎక్కువగా తినేయటంతో కడుపు నొప్పి ఎక్కువైంది. దీంతో ఆస్పత్రిలో క‌ల‌క‌త్తా మెడిక‌ల్ క‌ళాశాల‌, ఆసుప‌త్రిలో చేర్పించగా,  వైద్యులు దాదాపు రెండు గంట‌ల పాటు శ‌స్త్ర చికిత్స చేసి 639 మేకులను బయటకు తీశారు. 

కడుపు దగ్గర చిన్న గాటుపెట్టి అయ‌స్కాంతం సాయంతో వాటిని బయటకు తీయటం విశేషం. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్‌ బిశ్వాస్
వెల్ల‌డించారు. 

బాలిక మెడలో బాణం... 

బిర్‌భమ్‌ జిల్లాలోని సాయ్‌(స్పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా) సెంటర్‌లో ప్రమాదవశాత్తూ ఓ బాలిక మెడలో బాణం గుచ్చుకుంది. జువెల్‌ షేక్‌ అనే ఆర్చర్‌ సాధన చేస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న మరో యువ ఆర్చర్‌ ఫజిల్లా ఖాటూన్‌(14) మెడలోకి బాణం దూసుకెళ్లింది. వెంటనే బాలికను బోల్‌పూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు బాణాన్ని విజయవంతంగా తొలగించారు. ఫజిల్లాకు ప్రమాదమేం లేదని వైద్యులు వెల్లడించారు.  బాలిక అతన్ని(జువెల్‌)  గమనించకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కోచ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు