నైనిటాల్.. నయన మనోహరం!

3 May, 2016 09:54 IST|Sakshi
నైనిటాల్.. నయన మనోహరం!

వేసవి మొదలైందంటే చాలు.. మండే ఎండల నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు చల్లటి ప్రాంతాల సందర్శనకు టూర్‌లు ప్లాన్‌లు మొదలు పెడతారు. వాటిలో హిల్‌స్టేషన్‌లదే అగ్రస్థానం. అలాంటి వాటిలో ఉత్తరాంచల్‌లో ఉన్న అతి సుందర ప్రాంతం నైనిటాల్ ఒకటి. హిమాలయ ప్రాంతంలో అందమైన ప్రకృతి సోయగాలతో 12 చ.కిమీ విస్తీర్ణంలో 6000 అడుగల ఎత్తులో ఉన్న ఈ హిల్‌స్టేషన్ విశేషాల గురించి మనమూ తెలుసుకుందామా..!
 
భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలిచే నైనిటాల్ హిమాలయ శ్రేణుల్లో ఉంది. కుమావోస్ హిల్స్ మధ్య భాగంలో అందమైన సరస్సులతో నిండి ఉంది. నైనిటాల్‌ను పూర్వం నైనితాల్ అని పిలిచేవారు. నైనీ అంటే నయనం, తాల్ అంటే సరస్సు అని అర్థం. ఇది ప్రసిద్ధ హిల్‌స్టేషన్ గానేకాక పుణ్యక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.

పర్యాటక ఆకర్షణలు..
కిల్‌బరీ..
నైనిటాల్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న అందమైన పిక్నిక్ స్పాట్ ఇది. పచ్చని ఓక్, పైన్, రోడోడెండ్రాడ్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశంగా మార్చాయి. ఈ అడవుల్లో సుమారు 580 జాతులకు పైగా పలు రకాల వృక్ష జాతులు, రంగురంగుల పక్షులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2481 అడుగుల ఎత్తున ఉన్న లరికంత పర్యాటకులకు ఎన్నో అందమైన హిమాలయ దృశ్యాలను చూపుతుంది. ఇది నైనిటాల్‌లో రెండో ఎత్తై ప్రాంతం.

నైనాదేవి ఆలయం..
నైనాదేవి ఆలయం ఒక శక్తి పీఠం. నైని సరస్సుకు ఉత్తర దిశగా ఉంది. ఈ గుడిలో హిందువుల దేవత నైనాదేవి కొలువై ఉంది. ఈమె విగ్రహంతో పాటు గణపతి, కాలి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న పెద్ద రావిచెట్టు ఎంతో పురాతనమైంది.

చైనా శిఖరం..
నైనా శిఖరాన్నే చైనా శిఖరం అంటారు. ఇది నైనిటాల్‌లో ఎత్తై శిఖరం. సముద్ర మట్టానికి 2611 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని చేరుకోవాలంటే గుర్రంపై వెళ్లాలి. టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం. ఇక్కడ చాలా ఆహ్లాదంగా గడపొచ్చు. ఇక్కడే ఒక ఎకోకేవ్ గార్డెన్ కూడా ఉంది.

రోప్..
నైనిటా రోప్ వే ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. దీన్ని కుమావొస్ మండల వికాస్ నిగం నిర్వహిస్తుంది. ఇది ఇండియాలో స్థాపించిన తొలి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీటర్ల ఎత్తులో కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 825 కిలోల బరువు మోయగలదు. ఈ రోప్ వే స్నోవ్యూను కలుపుతుంది. రోప్ వే సెకనుకు 6 మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో టూరిస్టులు అద్భుత దృశ్యాలు చూసేందుకు అవకాశం ఉంటుంది.

నైనీ సరస్సు..
నైనిటాల్‌లో నైనీ సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలతో కన్ను ఆకారంతో ఉంటుంది. దీన్నే ‘ముగ్గురు రుషుల సరస్సు’ అని కూడా అంటారు. ఈ పేరు స్కందపురాణంలోని మానస్‌ఖండ్ అధ్యాయంలో ఉంది. ఈ సరస్సు చాలా పొడవైంది. దీని ఉత్తరపు కొనను ‘మల్లితాల్’ అని, దక్షిణపు కొనను ‘తల్లితాల్’ అనీ అంటారు.

స్నో వ్యూ..
స్నో వ్యూ అనేది సముద్ర మట్టానికి 2270 మీటర్ల ఎత్తున ఉన్న ఒక సుందర ప్రదేశం. ఇది నైనిటాల్ సిటీకు 2.5 కి.మీల దూరంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు చేరుకోవాలంటే రోప్‌వే, వాహనాల ద్వారా ప్రయాణించొచ్చు. ఇది షేర్ క దండ అనే ఎత్తై చిన్న కొండపై ఉంది.

గుహల తోట..
గుహలతోటను ఇకో గుహ గార్డెన్ అనికూడా పిలుస్తారు. ఈ గార్డెన్ పర్యావరణాన్ని ఆరాధించే వారికి ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ గుహలు పెట్రోమాక్స్ దీపాలతో ఒక మ్యూజికల్ ఫౌంటెన్‌తో ఉంటాయి. ఈ గుహలను టైగర్ కేవ్, పాంథర్ కేవ్, బాట్ కేవ్, స్క్విరాల్ కేవ్, ఫ్లై ఇంగ్ ఫాక్స్ కేవ్, ఏప్ కేవ్.. అని రకరకాల పేర్లతో పిలుస్తారు.

హార్స్ రైడింగ్..
నైనిటాల్‌లో హార్స్‌రైడింగ్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వివిధ ప్రదేశాలను వీక్షించేందుకు గుర్రాలను రవాణాకు వినియోగిస్తారు. సిటీలో గుర్రపుస్వారీని నిషేధించినప్పటికీ బారాపత్తర్ వద్ద దీన్ని ఆనందించొచ్చు. గుర్రాల పేడ సరస్సును కలుషితం చేస్తోందన్న కారణంతో నగరంలో గుర్రాల వినియోగం నిషేధించారు.

ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్..
‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్’ నైనిటాల్‌లో ప్రధాన ఆకర్షణ. ఈ సంస్థ మనోర శిఖరంపై నైనిటాల్‌కు 9 కి.మీ దూరంలో ఉంది. ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఈ సంస్థ ఆసక్తి కలవారికి ముందస్తు అనుమతులతో వారి టెలిస్కోప్‌లలో గ్రహాలు, నక్షత్రాలు పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సంస్థను 1955లో స్థాపించారు.

చరిత్ర..
బ్రిటిష్ వ్యాపారి బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఇక్కడ ఒక బ్రిటిష్ కాలనీని స్థాపించి ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తర్వాత కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. దీని పూర్తి స్థాయి అభివృద్ధి మాత్రం 1841 తర్వాతే ప్రారంభమయింది. షాజాన్‌వూరుకు చెందిన ఒక చక్కెర వ్యాపారి భక్తుల వసతి గృహం స్థాపించడంతో ఇక్కడ తొలి నిర్మాణం ప్రారంభమయింది. 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ అర్టిల్లరీ నైనిటాల్‌ను సందర్శించాడు. తర్వాత యునెటైడ్ ప్రొవిన్స్ గవర్నర్‌కు వేసవి విడిదిగా మారింది.


 

మరిన్ని వార్తలు