నీట్‌ టాపర్‌ నళిన్‌

6 Jun, 2019 04:24 IST|Sakshi
నళిన్‌ టాపర్‌ అని తెలిశాక జైపూర్‌లో కొడుకుతో కలసి సంబరాలు చేసుకుంటున్న తల్లిదండ్రులు

రాజస్తాన్‌ విద్యార్థికి ప్రథమ ర్యాంకు

తెలంగాణ అమ్మాయి మాధురికి బాలికల్లో టాప్‌ ర్యాంకు

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)– 2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గత నెల 5వ, 20వ తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్తాన్‌కు చెందిన నళిన్‌ ఖండేల్వాల్‌ తొలి ర్యాంకును సొంతం చేసుకున్నారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించగా, నళిన్‌ 701 మార్కులు సాధించారు. అలాగే ఢిల్లీకి చెందిన భవిక్‌ బన్సల్‌ రెండో ర్యాంకు, ఉత్తర ప్రదేశ్‌ విద్యార్థి అక్షత్‌ కౌశిక్‌ మూడో ర్యాంకు పొందారు. పరీక్షలో అన్ని సబ్జెక్ట్‌లను కలిపి చూసినప్పుడు వీరిద్దరికీ సమానంగా 700 మార్కులే వచ్చినప్పటికీ, జీవశాస్త్రంలో కౌశిక్‌ కన్నా భవిక్‌కు ఎక్కువ మార్కులు రావడంతో రెండో ర్యాంకును భవిక్‌కు కేటాయించారు.

ఇక అమ్మాయిల వరకు చూస్తే తెలం గాణకు చెందిన జి.మాధురీ రెడ్డి టాపర్‌గా నిలిచారు. 695 మార్కు లతో అఖిల భారత స్థాయిలో ఆమె ఏడవ ర్యాంకు సాధించారు. వికలాంగుల కేటగిరీలో రాజస్తాన్‌కు చెందిన భేరారాం 604 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. నీట్‌లో టాప్‌–10లో నాలుగు ర్యాంకులు రాజస్తాన్‌ వాళ్లకు, టాప్‌–50లో 9 ర్యాంకులు ఢిల్లీ వాళ్లకు దక్కాయి. ఢిల్లీ నుంచి పరీక్షకు హాజరైన వారిలో 74.9 శాతం మంది అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా చూస్తే అర్హత సాధించిన వారి శాతం 56.5 మాత్రమే కావడం గమనార్హం. భవిక్‌కు రెండో ర్యాంకు రాగా, 695 మార్కులు సాధించిన మిహిర్‌ రాయ్‌కి 9వ ర్యాంకు దక్కింది. 685 మార్కులు తెచ్చుకున్న విశ్వ రాకేశ్‌ 38వ ర్యాంకును పొందారు.

కామెడీ వీడియోలు చూసేవాణ్ని: భవిక్‌
దీర్ఘకాలంపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం తాను యుట్యూబ్‌లో స్టాండప్‌ కామెడీ వీడియోలు చూసే వాడినని నీట్‌ ద్వితీయ ర్యాంకర్‌ భవిక్‌ బన్సల్‌ చెప్పాడు. ఫలితాల్లో టాప్‌–10లో ఏదో ర్యాంకు వస్తుందని తాను అనుకున్నాననీ, కానీ రెండో ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదని భవిక్‌ ఆశ్చర్యంతో అన్నాడు. తాను ఇంట్లోనే కూర్చొని నీట్‌కు చదువుకున్నాననీ, తన తల్లిదండ్రులు తనను బాగా ప్రోత్సహించి, మద్దతుగా నిలిచారని తెలిపాడు. భవిక్‌ తల్లిదండ్రులిద్దరూ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులే. తండ్రి అకౌంట్స్‌ ఆఫీసర్‌ కాగా, తల్లి భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలు. ఇంటర్నేషనల్‌ బయాలజీ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు భవిక్‌ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఈ పోటీలో టాప్‌–35లో నిలిస్తే హంగేరీలో జరిగే పోటీకి భారత్‌ నుంచి భవిక్‌ వెళ్తాడు.

అభినందనలు తెలిపిన హెచ్‌ఆర్డీ మంత్రి
నీట్‌లో అగ్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ అభినందనలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత టాప్‌ ర్యాంకర్లకు పోఖ్రియాల్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. ర్యాంకుల కోసం కృషి చేసిన ఆ విద్యార్థులను ప్రశంసించి, వారికి పోఖ్రియాల్‌ అభినందనలు తెలిపారు.  

ఢిల్లీ టాప్‌.. నాగాలాండ్‌ లాస్ట్‌
నీట్‌–2019లో మెరుగ్గా రాణించిన తొలి పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ర్యాంకులు ఇవీ..
1.    ఢిల్లీ (74.9 శాతం)
2.     హరియాణా (73.4 శాతం)
3.     చండీగఢ్‌ (73.2 శాతం)
4.     ఆంధ్రప్రదేశ్‌ (70.7 శాతం)
5.     రాజస్తాన్‌ (69.6 శాతం)
6.     పంజాబ్‌        7. తెలంగాణ
8.     కేరళ         9. మణిపూర్‌
10. హిమాచల్‌ప్రదేశ్‌

కుటుంబ సహకారంతోనే ఈ ర్యాంకు: నళిన్‌
నీట్‌లో తొలి ర్యాంకు సాధించిన నళిన్‌ ఖండేల్వాల్‌ రాజస్తాన్‌లోని సికార్‌ జిల్లాకు చెందిన విద్యార్థి. ఫలితాల ప్రకటన అనంతరం అతను మాట్లాడుతూ పూర్తిగా తన కుటుంబ సహకారంతోనే తాను నీట్‌లో తొలి ర్యాంకును సొంతం చేసుకోగలిగానని  నళిన్‌ ఖండేల్వాల్‌ చెప్పాడు. ‘మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్లే. మా అన్న కూడా ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. ఈ పరీక్ష కోసం రెండేళ్లపాటు జైపూర్‌లో ఉండి పూర్తి శ్రద్ధతో కష్టపడి చదివాను. ఆ రెండేళ్ల కాలంలో సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉన్నాను. నా కుటుంబం నుంచి, మా టీచర్ల నుంచి నాకు పూర్తిస్థాయిలో సహకారం లభించింది. రోజుకు దాదాపు ఎనిమిది గంటలు చదివే వాణ్ని’ అని నళిన్‌ చెప్పారు. జైపూర్‌లోని అలెన్‌ కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అతను నీట్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. కోట పట్టణంలోని ఇదే ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు సైతం ఐదవ, పదవ ర్యాంకులు కైవసం చేసుకున్నారు.

నీట్‌–2019 విశేషాలు..
►  మొత్తం 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.
►  11 భాషల్లోని ఏదో ఒక భాషలో పరీక్ష రా సేలా విద్యార్థులకు అవకాశం కల్పించారు.
►  నీట్‌ పరీక్షకు మొత్తంగా 14,10,755 మంది హాజరయ్యారు. 1,08,015 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 7,97,042 మంది (దాదాపు 56.5 శాతం మంది) అర్హత సాధించారు.
►  పరీక్ష రాసిన అమ్మాయిల్లో 57.1 శాతం మంది, అబ్బాయిల్లో 55.7 శాతం మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. ఐదుగురు హిజ్రాలు కూడా పరీక్ష రాయగా, వారిలో ముగ్గురు ప్రవేశాలకు అర్హత పొందారు.
►  315 మంది విదేశీయులు, 1,209 మంది ఎన్‌ఆర్‌ఐలు, 441 మంది ఓసీఐ (ఓవర్సీస్‌ సిటిజెన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా) హోదా కలిగినవారు, 46 మంది పీఐవో (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌)లు నీట్‌లో అర్హత సాధించిన వారిలో ఉన్నారు.

►  79.3 శాతం మంది నీట్‌ను ఇంగ్లిష్‌లో, 11.8% మంది హిందీలో, 8.9 శాతం మంది ఇతర ప్రాంతీయ భాషల్లో నీట్‌ రాశారు.

రెండో ర్యాంకర్‌ భవిక్‌ బన్సల్‌

మరిన్ని వార్తలు