నళినీ చిదంబరంపై చార్జ్‌షీట్‌

11 Jan, 2019 18:51 IST|Sakshi

కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణానికి సంబంధించి మనీల్యాండరింగ్‌ విచారణలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భార్య నళినీ చిదంబరంపై సీబీఐ శుక్రవారం చార్జ్‌షీట్‌ నమోదు చేసింది. కోల్‌కతాలోని బరాసత్‌ కోర్టులో దర్యాప్తు సంస్థ ఈ చార్జిషీట్‌ను సమర్పించింది. ఈ కుంభకోణంలో నళీనీ చిదంబరం రూ 1.4 కోట్లు ముడుపులు స్వీకరించారని సీబీఐ ఆరోపించింది.

శారదా గ్రూప్‌ యజమాని, ప్రమోటర్‌ సుదీప్త సేన్‌తో కుమ్మక్కైన నళినీ చిదంబరం మోసపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ 2010 నుంచి 2014 మధ్య రూ 1.4 కోట్లు చేజిక్కించుకున్నారని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. సెబీ, ఆర్‌ఓసీ విచారణలను మేనేజ్‌ చేసేందుకు గాను 2010-12 మధ్య సేన్‌ కంపెనీల నుంచి ఆమె రూ 1.4 కోట్లు రాబట్టారని వెల్లడించింది.

శారదా చిట్‌ ఫండ్‌ స్కామ్‌లో నళినీ చిదంబరంను తొలుత 2016 సెప్టెంబర్‌లో సాక్షిగా దర్యాప్తుసంస్ధలు పిలిచాయి. ఓ టీవీ చానల్‌ డీల్‌కు సంబంధించి కోర్టుకు హాజరైనందుకు శారదా గ్రూప్‌ తరపున వాదనలు వినిపించినందుకు నళినీ చిదంబరం రూ 1.26 కోట్లు ఫీజుగా వసూలు చేశారు. కాగా శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌లో దాఖలైన ఆరవ అనుబంధ చార్జిషీట్‌లో నళినీ చిదంబరంతో పాటు అనుభూతి ప్రింటర్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సుదీప్త సేన్‌లను సహ నిందితులుగా సీబీఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు